Monday, July 20, 2015

మా గోదార‌మ్మ!!

గోదావరి జిల్లాల్లో ఉన్నవాళ్ళకి ఏదో విధంగా గోదావరి తో ఒక ఆత్మీయ సంబంధం వుంటుంది. అది చిన్నతనంలో కావచ్చు, ఒంటరితనం తో కావచ్చు, అమ్మమ్మ వూరు కావచ్చు, స్నానాల రేవు కావచ్చు....
ఆ గాలితో అనురాగం, ఆ నీళ్ళతో ఆప్యాయత వెరసి గోదారితో ఏదో తెలియని ఆత్మీయత.... ఏదేమైనా ఆ అనుబంధం మాత్రం జ్ఞాపకాలలో పదిలంగా ఎంత దూరం వెళ్ళినా.....

గోదారి గట్టున సంధ్యా సింధూరపు చీర చుట్టుకునే ఆకాశాన్ని చూస్తే, శిలలకైనా కళలు రావా?
చల్లని గాలి తిమ్మెరల గిలిగింతలు, తెరచాప పడవ పరుగుకి గోదారి అలల హొయలు... భావుకత భారాన్ని దించుకోవటానికి ఇది చాలదా? అందుకేనేమో, ఎంతో మంది కవులను, కళాకారులని అందించి కనువిందు చేసింది గోదారి తల్లి....

వెన్నెల‌, గోదారి రెండింట్లో ఏది అందమైన‌ది అని రెండు వేళ్లు చూపెడితే రెంటినీ ప‌ట్టేసుకోవాల‌ని అనిపిస్తుంది.
వెండివాన లా వెన్నెల కురుస్తుంటే, దానిని ఒడిసిపట్టి వెండి వెన్నెల చీర గా చుట్టుకుని వయ్యారి గోదారి నడుస్తుంటే క‌నులు ప‌క్క‌కు తిప్ప‌లేం. గోదార‌మ్మ కెర‌టాల మీద ఆ వెన్నెల కాంతుల్ని చూస్తే... సృష్టిలో అంద‌మంతా క‌నుచూపు మేర ప‌రుచుకొన్న‌ట్లు అనిపిస్తుంది. ఆ 'వెన్నెల గోదారి' ఒక అద్భుతమైన అనుభూతి, అనుభవించి తీరాల్సిందే!!
 
ఆప్యాయతతో అక్కున చేర్చుకునే అమ్మమ్మలు, పొట్ట తడిమి చూసే తల్లులు, అతిధి దేవోభవ అని నమ్మిన తండ్రులు, చెప్పకుండా ఇంటికొచ్చినా సంతోషించే అన్నలు, పట్టుపరికిణిలలో హరివిల్లులా అణకువైన ఆడపచులు..... ఇదీ మా గోదారమ్మ పెంపకం!! ఆయ్..! మాది గోదారండి అంటూ మాటల్లో కూసింత ఎటకారం, చేతల్లో కొండంత మమకారం.... ఈ గోదారి నీళ్ళు నేర్పిన విద్య!!

అంతేకాదండోయ్....
కొనసీమకి ఆకుపచ్చ చీర చుట్టిందీ, పాపికొండల పరువాలకి పైట వేసిందీ,
ఎంకి కి పాటలు కట్టిందీ, కిన్నెరసానికి కులుకులు నేర్పింది కూడా ఈ వన్నెల దొరసానే...

ఈసారి గోదారి పుష్కరాలకి రాలేకపోయినా, మళ్ళోచ్చినపుడు ఈ పెద్దమ్మని చూడటం మరచిపోకండే! అని చెప్పే పెద్దమనసున్న పెద్దింటమ్మ మా గోదావరి...

 

Sunday, May 10, 2015

మాతృదేవోభవ

జీవితం లో తుది శ్వాస వరకు మనం ఏర్పరుచుకునే బంధాలలో... అమ్మతో మననుకున్న అనుబంధం అన్ని బంధాల కన్నా తొమ్మిది నెలలుఎక్కువ... ఆ తొమ్మిది నెలల కాలమే, మిగతా వారి నుండి, అమ్మని వేరు చేసి ఆకాశం అంత ఎత్తున నిలబెడుతుంది...

అమ్మ అనే పదం మన పెదాలను కలిపినట్టే, ఇంట్లో అనుబంధాలను కలిపే వారధి అమ్మ. అడుగులే వెయ్యటం చేతకాని మనకి వేలు పట్టి నడిపించే నాన్నని పరిచయం చేసిందీ అమ్మే. ఇన్నేళ్ళ జీవితంలో కష్టాలన్నీ టీవీ సీరియల్స్ లో చూసినట్టు ఉన్నామే తప్ప ఏనాడు మా దరి చేరలేదంటే దానికి కారణం అమ్మా నాన్నే... చాలా మందికి బాల్యం మరలా తిరిగి వచ్చేస్తే బావున్ను అనే కోరిక ఉండటానికి ముఖ్య కారణం అమ్మేనేమో... ఆరుబయట కూర్చోబెట్టుకుని, గోరుముద్దలు తినిపిస్తూ, లాలి పాటలు పాడుతూ ఉండే అమ్మని ఎలా వద్దు అని అనగలం? అమ్మ చేతితో కలిపి పెట్టిన ఆవకాయ ముద్ద ముందు అమృతం కూడా దిగదుడుపేఅని చెప్తే అది అతిశయోక్తి కాదేమో...

పుట్టుక అంటూ లేని ఆ పరంధాముడు కూడా ఎన్నో సార్లు గర్భవాసం చేసి అమ్మ చేతి గోరుముద్దలు తిని పొంగిపోయాడు... చిక్కడు సిరి కౌగిటిలో, చిక్కడు సనకాది మునుల చిత్తాబ్జములన్, చిక్కడు శ్రుతి లతికావళి, చిక్కెనతడు లీల తల్లి చేతన్ ఱోలన్అని అంటారు పోతన గారు పరవశించిపోతూ... గొప్పగొప్ప జ్ఞానులకు దొరకని ఆ పరమాత్మ, ఆఖరికి లక్ష్మీ దేవికి కూడా చిక్కని ఆ పరంధాముడు, తల్లి చేతికి, తల్లి మమకారానికి దొరికిపోయి కట్టుబడ్డాడట... నిజమే, ఆ దైవాన్ని సైతం లాలించి ఆడిస్తుంది అమ్మ...

కడుపు కర్మాగారంలో మనకొక రూపం దిద్దిందనో....
ఈ  పాపపు ప్రపంచం  నుండి తొమ్మిది నెలలు భద్రంగా కాపాడిందనో...
ప్రసవ వేదన భరించి, నవ్వుతూ హత్తుకుందనో....
తన రక్తాన్ని పాలగా మార్చి మనకు ఆయుష్షు పోసిందనో....
ఎప్పుడూ మన కోసమే తపన పడే వ్యక్తి తో నాన్నగా అనుబంధం వేసిందనో....
అమ్మ ముందు నిలబెడితే నాన్నకి కూడా రెండో ర్యాంకే... అమ్మ ఎపుడూ ఒక మెట్టు పైనే...

మన బంగారు భవిష్యత్తుని చక్కగా చెక్కిన ఈ శిల్పి ఋణం తీర్చుకోలేకనే, 'మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ' అంటూ మనం మొదట అమ్మకు ప్రణామం చేసిన తరువాతనే తండ్రికి, గురువుకి ప్రణామం చేస్తాం ఇప్పటికీ... ఎప్పటికీ...



Wednesday, May 6, 2015

జంతుకులమంతా ఒకటే

అన్నమాచార్య జయంతి కదా అని ఆయన కీర్తనలు వింటుంటే, బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే అనే కీర్తన దగ్గర ఆగాయి ఆలోచనలు. "ఇందులో జంతుకుల మంతా ఒకటే....".  ఇంచుమించు 600 ఏళ్ళ క్రితం ఈ మాట అనటానికి ఎంత ధైర్యం, విచక్షణ కావలి....

ఉన్న గీతని చెరపకుండా చిన్నగా చెయ్యాలంటే, పక్కన ఇంకో పెద్ద గీత గియ్యాలన్నాట్ట ఒక పెద్దాయన. నిజమే, పక్కవాటితో పోలిస్తేనే తేడాలు తెలిసేది..... ఊర్లో వున్నప్పుడు, రెడ్డి, వైశ్య, కాపు అని ఇంకా ఏవో అనుకునేవాళ్ళు...  హైదరాబాద్ వెళ్ళినప్పుడు, తెలంగాణా వోడా? ఆంధ్రో డా? అనేవారు. బెంగుళూరు లో వుంటే, కన్నడా? తమిళా? తెలుగా? అని అడిగితే, నార్త్ లో చదువుకుంటున్నప్పుడు సౌత్ ఇండియన్నా?  నార్త్ ఇండియన్నా? అని. అంటే కవరేజ్ రేంజ్ పెరిగేకొద్దీ, తేడాలు కొంచెం చిన్నవి అవుతాయి మాట.  ఆసియాని కవర్ చేసి చూస్తే, ఇండియన్? చైనీస్? జపనీస్?. యురోప్ లో ఉంటున్నప్పుడు ఏసియన్? యురోపియన్? అమెరికన్? ఇలా... ఇంకొంచెం బయటికి వచ్చి, స్పేస్ నుంచి చూస్తే, భూగ్రహం వాసా? గ్రహాంతర వాసా?? అని తేడా చూపిస్తాం. అప్పటిదాక వున్న ఏసియన్, ఇండియన్, తెలుగోడు, ఆంధ్రోడు అని తేడాలు పోయి ఒకటే మిగిలింది. అంటే కొలించే మొత్తం ఎక్కువయ్యే కొద్ది, కనిపించే తేడాలు చిన్నవైపోతున్నాయి. ఇంకొంచెం దాటి చూస్తే, ఏ ప్లానెట్ సిస్టం, ఏ మిల్కీవే?.....

ఏ అవగాహన లేని నాలాంటి వాడి దృష్టికి ఇలా పరిధులు పెంచుకుంటూ పోతూవుంటే ఆ పరిధి లో వున్నవన్నీ ఒకేలా సమానంగా కన్పిస్తుంటే, ఈ విశ్వానికి అధిపతి, ఈ జగత్తును పాలించే ఆ పరమాత్ముడి దృష్టికి ఈ మొత్తం విశ్వం అంతా ఒకేలా కనిపించటంలో ఆశ్చర్యం ఏముంది. నిజమే, చూసే దృష్టిని బట్టే సృష్టి ఎలావుందో కనిపిస్తుంది. దృష్టి పరిధి పెంచుకుంటూ పోతే అంతరాలు పోయి అంతా సమానమే అని అనిపిస్తుంది.

అందుకే "ఇందులో జంతుకులమంతా ఒకటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ".


Sunday, May 3, 2015

ప్రభు మేని పైగాలి

Live commentary అంటే మనకి క్రికెట్ గుర్తొస్తుంది. Batsman ఎలా కొట్టాడో, ఫీల్డర్ ఏం చేస్తున్నాడో అక్కడ జరుగుతున్నది చూసి కళ్ళకు కట్టినట్టు చెప్తుంటే మనం నోరప్పగించి వింటాం. కాని ఎప్పుడో జరిగిపోయింది, ఇలా జరిగిందని తాను అనుభవించి మన కళ్ళకు అప్పజేప్పటం అంత సులభం కాదు. ఇదంతా ఎందుకంటే, నా కళ్ళల్లో Live commentary కనిపింపజేసిన విశ్వనాథ వారి ఒక పద్యం గురించి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం గురించి చెప్పేటంతటి స్థాయి గాని, అర్ధంచేసుకునేంతటి శక్తి గాని నాకు ఏ మాత్రం లేవు. కానీ ఆ స్థాయి కవి, ఎంత సులభంగా నాలాంటి మామూలు పాఠకుడికి కూడా కళ్ళ ముందు కనిపించేలా చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది, దాంట్లోంచి బయటికి రాలేకే ఇదంతా.

సాధారణంగా ఏ కవైనా, పాఠకుడి స్థాయికి దిగి రచనలు చెయ్యటం పరిపాటి. కాని విశ్వనాథ వారు మాత్రం పాఠకుడిని కొంచెం పై స్థాయికి తీసుకెళ్ళి చదివేలా చేస్తారు. రామాయణ కల్పవృక్షంలో, శివధనుర్బగం ఘట్టంలో వచ్చే ఈ పద్యమే అందుకు ఉదాహరణ. “నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత....” అంటూ ఎక్కడా ఆగకుండా రకరకాల సమాసాలతో వెళ్ళిపోతుంది. ఓసారి, నాలాంటి పాఠకుడు ఎవరో, “ఎందుకు స్వామి, ఇలా రకరకాల సమాసాలు వాడేస్తారు, మాములుగా, ఇలా శివధనుస్సు విరిచాడు అని చెప్తే సరిపోదా” అని అడిగాడట. దానికి సమాధానంగా విశ్వనాథ వారు, “నువ్వు ఊరి నుంచి వస్తూ వుంటే సైకిల్ పేలిపోయి పంక్చర్ అయ్యింది, దాన్ని ఎలా చెప్తావ్” అని అడిగితే,  ఏముంది “నేను ఊరి నుంచి వస్తున్నప్పుడు దారిలో నా సైకిల్ టైరు ఢాం అని పేలిపోయింది అని అన్నాడట. “హా.... ఆ ‘ఢాం’ నే నేను ఇలా సమాసాలుగా చెప్తాను, ఆ శివధనుర్బగం లో వచ్చే పద్యం కూడా అటువంటిదే” అని అన్నారట. అదీ ఆయన స్థాయి. శబ్ధాలను, ఉరుములను, మెరుపులను కూడా కవిత్వం లో జొప్పించగలరు. ఇది తిక్కన గారి శైలికి (దీని గురించి మరో సారి) చాలా దగ్గరగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఆ స్థాయికవి, ఒక చక్కని ఘట్టాన్ని అంతలా కళ్ళకి కట్టినట్టు చెప్తుంటే, కనీసపు అవగాహన లేని నాలాంటి వాడు కూడా ఆనంద పరవసుడైపోతాడు. “రాముడు గౌతమముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, అహల్య శాప విమోచనం అయిన సంఘటన” అది. మాములుగా అయితే, “రాముడి పాదం తగిలి ఒక రాయి అహల్య గా మారింది” అనో, సినిమా బాష లో చెప్పాలంటే, “ఆ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట” అనో... సింపుల్ గా తెల్చేయోచ్చు. కాని విశ్వనాథ వారి శైలే వేరు. పువ్వు పూయాలంటే, ముందు మొక్కకి కాయ కాయాలి, ఆ తర్వాత మొగ్గ గా మారాలి. ఆ మొగ్గ విచ్చుకోవాలి, మెల్లిగా పూరేఖలన్నీ విచ్చుకోవాలి. అప్పుడే, పువ్వు గా మారాలి. సరిగ్గా ఇదే విశ్వనాథ వారు కళ్ళ ముందు దృశ్యాలు కదిలేలా మన ముందు సాక్షాత్కరింపజేస్తారు ఆయన అనుభవించింది.

ప్రభు మేని పైగాలి పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చె
ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు మొలిచె
ప్రభు మేని నెత్తావి పరిమళించినతోన అశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందె
ప్రభు నీలరత్న తోరణమంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగె

“రాముని శరీరం నుంచి వీచిన గాలి సోకినంతనే పాషాణానికి స్పర్శ, ఆయన కాలి సవ్వడి వినగానే చెవులు, ఆయన శరీర పరిమళం అనుభూతం కావటంతో ఘ్రాణేంద్రియం (వాసన), నీలిరత్న కాంతులు జల్లుతున్న ఆయన శరీరాంగాలు కనిపించగానే చూపు వచ్చాయి” అని కళ్ళకు కట్టినట్టు ఒక్కోటీ ఎంత అద్భుతంగా ఆవిష్కరింపజేసారో.

ఇటువంటి కవి సామ్రాట్ కనుకనే, కేంద్ర సాహిత్య ఎకాడమి అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు వారయ్యారు ఈ రామాయణ కల్పవృక్షానికి. అంతే కాదు, ఇప్పటి దాక భారతదేశ ఆధునిక సాహిత్యంలో వచ్చిన కథ(నవల) లో ఆయన రాసిన వేయిపడగలు కచ్చితంగా మొదటి పదిలో ఎక్కడోక్కడ పెద్ద పీఠ వేసుకుని కూర్చుంటుంది. ఆయన రచనల్లో కనీసం ఒక రెండు శాతం అయినా అర్ధం చేసుకునే స్థాయి నాకు కలగాలని కోరుకుంటూ.....

Sunday, February 15, 2015

ప్రేమంటే...

Mother’s Day, Father’s Day..... "అబ్బే ఇవి మనవి కావెహె! Westerners కి ఫ్యామిలీ రిలేషన్స్ తక్కువ కాబట్టి, ఇలా ఏదో ఒకటి వుండాలి, మనకి అలా ప్రత్యేకం గా వుండక్కర్లేద్దు...." ఇది ఒక సగటు యువకుడు చెప్పే మాట. మరి ఆ ఎక్సెప్షన్ వాలైంటైన్స్ డే కి లేదే? ..... నిజమే, మనం ఎప్పుడూ అమ్మా నాన్నలతో కలిసే వుంటాం కాబట్టి మనకి ప్రతీ రోజూ మదర్స్ డే, ఫాదర్ డే..... కాని ప్రేమ ని వాలైంటైన్స్ డే కి మాత్రమే పరిమితం చెయ్యటం అవివేకం...


తను వండిన అన్నాన్ని తినిపిస్తూ వుంటే, చిట్టి చిట్టి చేతులతో రెండు మెతుకులు తీసుకుని తిరిగి అమ్మకి పెడితే,  “మా పిల్లాడు బంగారం” అని మురిసిపోయి నుదిటి మీద పెట్టుకునే అమ్మ ముద్దు ప్రేమంటే.....

సాయంత్రం వరకు కష్టపడి అలసిపోయినా, ఇంటికి రాగానే అలసట మరచిపోయి పిల్లాడిని దగ్గరికి తీసుకుని “బాగా లేట్ అయ్యిందారా నాన్నా” అని తండ్రి ఇచ్చే కౌగిలింత ప్రేమంటే.....

ఏమి చెయ్యాలో తెలియని అయోమయ స్థితి లో వుంటే “మరేం పర్లేదురా, కంగారు పడకు, నేనున్నా కదా” అని అన్నయ్య చెప్పే ధైర్యమే ప్రేమంటే.....

మూడ్ పాడయ్యి, దిగులు గా కూర్చుంటే... “అలా ఉండకురా, నువ్వు లేకపోతే సరదా లేదు, పద” అని స్నేహితుడి పలకరింపే ప్రేమంటే....

ప్రేమంటే, కేవలం ఒక అమ్మాయి లేక అబ్బాయి చెయ్యి పట్టుకుని నడవటం మాత్రమే కాదు.... ప్రేమంటే ఆప్యాయత, ప్రేమంటే బాధ్యత, ప్రేమంటే పంచుకోవటం, మన్నించటం.........

పుట్టగానే ఏడుస్తున్న పిల్లాడిని చూసాక వచ్చే అమ్మ నవ్వే ప్రేమ.
జాగ్రత్తగా చేరావా నాన్నా అంటూ రాత్రి దాటాక వచ్చే నాన్న మాటే ప్రేమ.
స్కూల్ కి వెళ్తున్నప్పుడు తమ్ముడి చెయ్యిని అన్నయ్య గట్టిగా పట్టుకోవటమే ప్రేమ.
వంట చేసి, భర్త కి పెట్టేముందు రుచి చూసే భార్య ఎంగిలే ప్రేమ.
 
ప్రేమ ఆస్వాదించటం నేర్పిస్తుంది, బాధ్యతలు పంచుకోటం నేర్పిస్తుంది., బంధాలు పెంచుకోవటం నేర్పిస్తుంది.... జీవించటం నేర్పిస్తుంది. 


Wednesday, April 9, 2014

పురుష నిధానము


రాముడు... భారతదేశంలో పుట్టిన మతం వారికైనా పరిచయం అక్కర్లేని పేరు... ధర్మానికి ప్రతి రూపంగా కొనియాడబడుతున్నవాని పేరు... భారతీయ సత్ సంప్రదాయాలని ఇప్పటికీ ప్రభావింపచేస్తున్న (ఎప్పటికీ ప్రభావింపజేసే) వాని రూపం...

రాముని నడతను, నడకను విపులంగా వాల్మీకి చేత విసదీకరించిందే రామాయణం...  గాధ గురించి అసలు పరిచయమే అక్కర్లేద్దు... దీని మీద ఎందరో మహానుభావులు పులకించి, పరవశించి, అనుభవించి  రాసుకున్న భావాలు ఎన్నోఅలానే,  విమర్శలు చేసి, పుక్కిట (దీని అర్ధం ఏమిటో ఇప్పటికీ నాకు సరిగ్గా తెలీదు) పురాణంగా కొట్టిపారేసిన మహా మేధావులు (??) మరెందరో....

రామాయణ అస్తిత్వాన్ని ప్రశ్నించటానికి బదులు, రాముని వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే ఒక మానవీయ దృక్పధం అలవడుతుంది అనటం లో సందేహమే లేదు... రామాయణం లో ఒక విషయాన్ని గాని గమనిస్తే, రాముడు తో పరిచయం, అనుబంధం, కనీసం దూరం నుంచి చూసిన ప్రతీ ఒక్కరూ రాముని గురించి పోగిడినవారే గాని, స్వతహాగా  తెగిడినట్లు కనపడదు... ఇంకా చెప్పాలంటే, రామునికి విరోధులుగా చెప్పబడిన వారు కూడా ఇంకా గొప్పగా పొగిడిన వారే…. దానికి సాక్ష్యం మారీచుడు చెప్పిన శ్లోకమే, " రామో విగ్రహవాన్ ధర్మః, సాధుః సత్య పరాక్రమః" ఇప్పటికీ రాముడు అంటే ఏమిటో చెప్పటానికి వాడబడుతుంది..... నిజమే రాముడు పోత పోసిన  ధర్మం....

గురువుకి శిష్యుడి గా విశ్వామిత్రుడి వెనకాల మారు మాటాడకుండా వెళ్ళి, చెప్పినవన్నీ చేసి, పెళ్లి సమయం లో మాత్రం తండ్రి గారిదే నిర్ణయం అని చెప్పి, కొడుకు గా తండ్రి పట్ల ఎంతటి గౌరవం పాటించాలో ఆచరించి చూపించాడు... అదే తండ్రి, పట్టాభిషేకం చేస్తాను అని, మరుసటి రోజునే అడవికి వెళ్ళిపొమ్మని చెప్పినపుడు లక్ష్మణుడు ఆక్రోశం పొందాడు గాని రాముడు కనీసపు తొట్రుపాటు కూడా పడలేదు... అప్పుడు లక్ష్మణుడితో అంటూ...  నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తాను అన్నవాడూ నాన్నే, ఇవాళ పొద్దుట పిలిచి అరణ్య వాసానికి వెళ్ళిపోమన్నవాడూ నాన్నే... పిలిచి రాజ్యం ఇస్తాను అన్నవాడు దేవుడే, వెళ్ళిపో అన్న వాడూ దేవుడే... రెండిటియందు నాన్నలో నేను దేవుడినే చూస్తున్నాను. వెళ్ళిపోమన్నప్పుడు శత్రువుని, రాజ్యం ఇస్తానూ అన్నప్పుడు తండ్రిని చూడటం లేదు, దైవాన్ని అనువర్తించటం నేర్చుకో అని చెప్పటం రామునికి పితృవాక్య పరిపాలన పట్ల ఉన్న గౌరవానికి పరాకాష్ట...

వనవాసం లో ఉండగా, సీతమ్మపై ఒక కాకి వాలి, కండ పీకుతూ ఉంటే, కోపం తో ఆ కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించటం వినటానికి వేరే విధం గా ఉన్నా, తన భార్య (తను రక్షించవలసిన వారి) జోలికి వస్తే  ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదు అని చాటి చెప్పటం తన బాధ్యతల పట్ల, తన కర్తవ్య నిర్వహణ పట్ల ఉన్న నిబద్దతకి పరాకాష్ట...

విభీషణుడు  శరణు కోరుతూ నిలబడినపుడు, వానర సేన అంతా (ఆంజనేయుడు మినహా) విభీషణుడి ని నమ్మకూడదు, అభయమివ్వకూడదు అని అన్నప్పుడు, శ్రీ రాముడు అందరికీ చెప్తూ...వచ్చిన వాడు విభీషణుడే కానీ, రావణుడే కానీ, నన్ను శరణు కోరినవారు ఎవరైనా సరే రక్షిస్తాను, ఒకానొకప్పుడు చెట్టు మీద ఆనందంతో రమిస్తున్న రెండు పావురాలలో, ఆడ పావురాన్ని ఒక బోయవాడి బాణం పెట్టి కొట్టి, పడిపోయిన ఆ ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకుని తినేసి వెళ్ళిపోయాడు. ఆడ పావురం చనిపోయిందని మగ పావురం విశేషమైన బాధ పడింది. కొంత కాలానికి అదే బోయవాడు ఆహారం దొరక్క, నీరసం చేత ఆ మగ పావురం ఉన్న చెట్టు కింద పడిపోతే, ఆకలితో పడిపోయిన అతనిని కాపాడటానికి ఆ పావురం ఎక్కడినుంచో ఎండు పుల్లలు, అగ్ని తెచ్చి అతని ఆకలి తీర్చటం కోసం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్య ని చంపిన అదే బోయవాడు తన చెట్టు దగ్గరికి పడిపోతే అదే శరణాగతి అని భావించి, ఆ మగపావురం తన ప్రాణాలు ఇచ్చి మరీ అతనిని రక్షించింది. నేను మనుష్యుడి గా పుట్టి, నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములు ఎంచి శరణాగతి ఇవ్వను అని ఎలా అనగలను,  ఈ సమస్త భూమండలము లో నన్ను శరణాగతి చేసిన ఎవ్వరి యోగ క్షేమములైనా నేను వహిస్తాను, అందుచేత విభీషణుడి కి శరణు ఇస్తున్నాను అని చెప్పటం రాముడి కారుణ్యానికి పరాకాష్ట...

ఇలా రాముడి ప్రతీ అడుగు ధర్మాన్ని అనుసరించే వేయబడింది, అందుకే  సీతాయః చరితం మహత్ కూడా  రామాయణం గానే పిలవబడింది... నిజమే రాముడు పోత పోసిన ధర్మం, ఓర్పుకీ సహనానికీ నిలువెత్తు నిదర్శనం, పురుష నిధానము, సుగుణాల భాండాగారం...

రామదాసు గారి పదాలలో....
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ !!

అందుకే... బంటు రీతి కొలువు ఈయవయ్య రామా...
 

Monday, March 10, 2014

శంకరాభరణం


మొన్న జనవరికి సరిగ్గా 35 ఏళ్ళు పూర్తిచేసుకున్న సినిమా ఎందుకో గుర్తొచ్చి మరలా ఓసారి చూడాలనిపించింది…. సంగీతంలో ఎలాంటి అనుభవం గాని, అర్హతలు గాని లేని నాలాంటి అర్భకుడికి కూడా, ఆహా ఎంత అద్భుతంగా ఉందో అని అనిపిస్తూనే ఉంటుంది ఎన్ని సార్లు చూసినా…. ఈ చిత్రం లో ప్రతీ సన్నివేశాన్ని హత్తుకునేలా తీసిన దర్సకత్వ ప్రతిభ, వాటికి తగ్గట్టే సంభాషణలు, మరో మెట్టుకు తీసుకువెళ్ళే సంగీతం, దానికి ఇంపైన సాహిత్యం…. ఒకదానితో ఒకటి పోటీ పడ్డట్టు ఉన్నాయి కాబట్టే ఇన్నేళ్ళకి కూడా సాహితీ ప్రియులను, సగటు సినిమా అభిమానిని ఆకట్టుకుంటూనే ఉంది….
సినిమా అన్నాక కధ కంటే కధనానిదే పెద్ద ప్రాత్ర…. అందుకే, ప్రతి సన్నివేశంలోనూ ఆ ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే (నాకు అంతలేదు గాని) "శంకర శాస్త్రి అనే సంగీత కళాకారుడి జీవితంలో కాలం తెచ్చే మార్పులు"…. అనే చిన్న కథని చాలా అందంగా తెరకెక్కించారు…. ఇప్పటి బాషలో చెప్పాలంటే హీరో (శంకరశాస్త్రి గారి)  ఇంట్రడక్షన్ సీన్ లోనే చెప్పాలనుకున్నది అంతా చెప్పేశారు…. శంకరశాస్త్రి గారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు కాలికి ఉన్న గండపెండేరాన్ని చూపిస్తూ, అలా తన పంచె కి ఉన్న చిరుగులు చూపిస్తూ ఆపటంలో...... ఏం చెప్పాలనుకుంటున్నారో  చెప్పకనే చెప్పేశారు…. శాస్త్రి గారి ఇంట్లో నాలుగు గొడవ మధ్య ఎక్కడ చూసినా సప్త స్వరాలు వినిపిస్తాయి అని నాలాంటి సగటు ప్రేక్షకుడికి కూడా అనిపించేలా చెయ్యటం…. రెండు ముఖ్య పాత్రల (శంకరశాస్త్రి, తులసి) మధ్య ఒకే ఒక్క డైలాగ్ పెట్టి ఇద్దరి మధ్య ఉన్న సీన్స్ మలచిన తీరు కచ్చితం గా అభినందిచాల్సిందే…. శాస్త్రి గారిని తిట్టిన జమీందార్ ని చంపి, ఆ రక్తంతో శంకర శాస్త్రి గారి పాదాలు కడిగించిన తీరు మహాభారతం లోని ద్రౌపది-భీముడు-దుశ్శాసనుడు సన్నివేశాన్ని ఓసారి జ్ఞప్తికి తెచ్చేలా చేసింది.. తన కూతురు స్వరాలలో అపశ్రుతి పలికిందని శాస్త్రి గారు చేతిలో కర్పూరం వెలిగించుకుని పాపపరిహారం చేసుకున్న తర్వాత, ఆ చేతికి శాస్త్రి గారి కూతురు వచ్చి వెన్నపూస రాస్తూ, స్వరాలూ సరిగ్గా పాడుతుంటే, ఎన్ని సార్లు చూసినా ఈ సీన్ కి కళ్ళల్లో నీటి సుడులు తిరగక మానవు అంటే అతిశయోక్తి కాదేమో…. అలాగే శాస్త్రి గారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పిల్లాడైన శంకరం ఆయన కాళ్ళు పడుతూ మానస సంచరరేకీర్తన పాడుతూ శ్రీ రమణీ..” అన్న తర్వాత గుర్తుకురాకపోతే శాస్త్రి గారు నిద్రలోనే ఆ తర్వాత అందుకుని పాడటం, ఆయనెంత తాదాత్మ్యం చెందాడో చెప్పడానికి చక్కగా మలచిన సందర్భం…. బ్రోచేవారెవరురా అనే కీర్తనని తప్పుగా పాడుతున్నప్పుడు శాస్త్రి గారిచే చెప్పించిన సందర్భం, పాప్ గ్యాంగ్ కుర్రాళ్ళకి బుద్ధి చెప్పే సందర్భం లాంటి మహోత్తరమైన సన్నివేశాలు కోకొల్లలు….
ఈ చిత్రం లో సంగీతం, పాటలకి కుదిర్చిన సాహిత్యం గురించి చెప్పాలంటే సాహసమే అవుతుంది, తులసి, శాస్త్రి గారు మొట్ట మొదటిగా కలిసే సీన్ లో వచ్చే స్వరాలు, ఒక్క తులసినే కాదు మనల్ని కూడా ముగ్ధుల్ని చేస్తుంది…. కన్నడ సంఘం వారు చేసే సన్మానానికి రైలు దిగి నడిచుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చే చిన్నపాటి వీణా నాదం ఆహా అమోఘం…. అలాగే కోర్ట్ సీన్ తరువాత వచ్చే ఫ్లూట్ తో నేపధ్యసంగీతం ఓసారి అలా ఆకాశం లో ఓలలాడించక మానదు…. శాస్త్రి గారిని, శంకరం ప్రసన్నం చేసుకునేప్పుడు వెనకాల మెల్లిగా వచ్చే వేణుగానం వింటే కచ్చితంగా ప్రసన్నం అవ్వాల్సిందే…. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు అని గళమెత్తి పాడుతుంటే, ఆ రాగం వల్ల సాహిత్యానికి అందం వచ్చిందో లేదా సాహిత్యం వల్ల ఆ స్వరాలకు అందం వచ్చిందో తేల్చిచెప్పటం కష్టమే…. అప్పుడు పడుతున్న వర్షాన్ని చూసి, పరవశాన శిరసు ఊగితే ఇలకు ఇలా వర్షంగా జారిన శివగంగ అట, ఆహా ఎంత చక్కని వర్ణన…. ఇంకొక పాట లో అద్వైత సిద్ధికి అమరత్వ లబ్దికి గానమే  సోపానము, సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము అని ఎంత చక్కగా చెప్పెసారో సంగీతం అంటే ఏంటో, నాదోపాసన అంటే ఏంటో.... శాస్త్రీయ సంగీతాన్ని పాశ్యాత్య సంగీతం కబలించేసింది అని చెప్పే సందర్భంలో వాడిన నేపద్యగీతం ఓసారి విని తీర్సిందే, ఎంత చక్కగా చూపించారో ఆ వేరియేషన్…. సందర్భానుసారంగా వచ్చిన కీర్తనలను మాత్రం అత్యద్భుతమే అనాలి…. 
శంకరాభరణం సినిమా పేరు వినగానే మొదటిగా గుర్తొచ్చేది సంగీతమే అయినా, ఈ సినిమా లో మాటలు (కాదు కాదు ముత్యాలు) మరో అద్భుతమే అని చెప్పాలి.... జంధ్యాల అనగానే మనకి గుర్తొచ్చేవి కామెడీ సినిమాలే అయినా, ఆయనలో ఉన్న రెండో వైపు తరచి చూడాలంటే ఇలాంటి గాభీరమైన సంభాషణలు వినాల్సిందే.... ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికే తప్ప కులంపేరుతో మనుషుల్ని విడదియ్యడానికి కాదు అని కులం, దాని అడ్డుగోడలు గురించి ఎంత సున్నితం గా చెప్పారో…. శాస్త్రి గారి వ్యక్తిత్వం గురించి ఒక్క ముక్కలో ఆ లోకేస్వరుడికి తప్ప లోకానికి భయపడనురా మాధవా అని చెప్పిస్తూ, ఆ గుర్రపు డెక్కల చప్పుడు లో కూడా కోపం కనిపిస్తుందిరా దేవుడా అని అనిపిస్తూ సన్నివేసంలో కోపాన్ని జొప్పించటం…. ఆ కీర్తనలోని ప్రతీ అక్షరం వెనుకా ఆర్ద్రత నిండిఉంది, తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండెలోతుల్లోంచి తనకుతానే గంగాజలంలా పెల్లుబికిన గీతమది. రాగమది అంటూ కీర్తన గొప్పతనాన్ని వర్ణించిన వైనం, ఆర్ద్రత గురించి వివరుస్తూ, అది మాటలకు అంతుచిక్కదు అని అంటూనే ఎంత అందమైన పదాల కూర్పు చేసారో, నిజమే అది బాషకి అందని భావన, మనస్సుని ద్రవింప చేసే భావన”…. వేటూరి గారు తనదిన శైలి లో సంగీతం గురించి పాట సాహిత్యంలో చెప్తే, జంద్యాల గారు ఇలా సంగీతానికి భాషాభేదాలు. స్వపరభేదాలు ఉండవు, అదొక అనంతమయిన అమృతవాహిని. ఏ జాతివాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు అంటూ “Music is Divine” అని కచ్చితంగా చెప్పేశారు…. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిపోయి, దానికి సరైన విలువ ఇవ్వట్లేదని విలపిస్తూ రసికులు కాని వాళ్లకు కవిత్వాన్ని వినిపించే దౌర్బాగ్యం తన నుదుట రాయొద్దని వేడుకున్నాడురా కాళిదాసు అంటూ చెప్పించటం వినేవాళ్ళ (చూసే వాళ్ళ) మనసుని మాత్రం బరువెక్కించక మానదు…. ఇక క్లైమాక్స్ సీన్స్ లో మాత్రం జంద్యాల కలం కదం తోక్కిందనే చెప్పాలి, పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడుతున్నా సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతిని అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో,వారికి శతసహస్ర వందనాలర్పిస్తున్నాను….” అంటూ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్కవ్యక్తి ఉన్నా సరే ఈ అమృతవాహిని ఇలా అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది అని అత్యంత అద్బుతంగా ముగింపు పలికారు….
అందుకే ప్రతీ సన్నివేశం ఒక కళాఖండం లా మలచబడింది కాబట్టే, ఇన్నేళ్ళకి, ఎన్నేళ్ళ కీ కూడా, ఈ చిత్రం అందరి హృదయాలలో కదలాడుతూనే ఉంటుంది, తెలుగు సినీ అభిమాని సగర్వం గా చెప్పుకోగల చిత్రంగా వర్దిల్లుతూనే ఉంటుంది….
నిజమే, సంగీతం అనంతవాహిని, ఈ శంకరాభరణం అజరామరం….
వేటూరి గారి మాటల్లోనే, అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్దికి, గానమే  సోపానము…. సత్వ సాధనకు, సత్య శోధనకు, సంగీతమే ప్రాణము….”
ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు….