Friday, October 12, 2012

నా నిర్వచనం


ఇద్దరి మౌనం మధ్య ఒకే ఒక్క భాప్రేమ
దైవాన్ని కూడా లాలించి ఆడిస్తుందిఅమ్మ
తాను కరిగిపోతూ తన ప్రతిరూపానికి వెలుగు చూపిస్తాడునాన్న
అమ్మ కి నాన్న, నాన్నకి అమ్మ – మా అన్న
మగవానికి మధుర భావనమగువ
చిన్ననాటి జ్ఞాపకాల గని – మా ఊరు
ఎన్నో కలలను కాలరాస్తుంది, మరెన్నో ఊహలకు ఊపిరిపోస్తుందిపెళ్ళి
పిల్లనగ్రోవి గాయాలకి పెదవులు ఇచ్చే ట్రీట్మెంట్సంగీతం
కలలన్నీ కరిగించినా ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటుందికాలం
ఆశపడటం, నిరాశపడటం, అంతలోనే సద్దుకుపోవటంజీవితం

Thursday, October 11, 2012

మరిచిపోయింది


జ్ఞాపకం వెళుతూ వెళుతూ...
    వెలుగుతూ ఉన్న జీవితం లో చీకటిని నింపింది...
      మాటల ప్రవాహానికి మౌనాన్ని నేర్పింది...
         నిదుర లేని రాత్రుళ్ళని పరిచయం చేసింది...
           స్వప్నాలన్నీ సత్యాలు కావని చెప్పింది...
                కలలన్నీ కల్లలే అని తెలిసోచ్చేలా చేసింది...
                కలతల్ని కవితలు గా చేసుకోమ్మంది...
                       గాయాల్ని గేయాలుగా మార్చుకోమని సలహా ఇచ్చింది...
                           కానీ, మరిచిపొమ్మని చెప్పటం మాత్రం మరిచిపోయింది...

Saturday, October 6, 2012

చేయూత



నేను ఎవరో తెలుసా? మీరు ఇది చూస్తున్నారు అంటే అది నావల్లే .... ఇంకా గుర్తుపట్టలేదా? అదేనండి మీకు అన్నీ చూపిస్తున్నది నేనే, కళ్ళు..... ఏంటి ఆశ్చర్యపోతున్నారా? చూపించే కళ్ళు మాట్లాడుతున్నాయి అనిఏంచెయ్యాలి మరి, కొందరికి కళ్ళు ఉన్నా చూడలేకపోతుంటే నాకు మాటలు రాకపోయినా మాట్లాడాల్సి వస్తుంది.... తప్పక మాట్లాడుతున్నానే తప్ప, ఎవ్వరిని నొప్పించటానికి మాత్రం కాదు సుమా....

ఫోటో చూసారా, తను కూడా మీ అందరి లానే ప్రకృతి ఒడి లోనే పుట్టింది... మీ అందరి లానే గాలినే పీల్చుకుంటుంది...  కాని మీ అందరిలా మాత్రం చూడలేదు తనకి నేను లేను.... అవును ఆమెకు  కళ్ళు లేవు…. తను అంధురాలు...  అలా అని తనేమి సమాజాన్ని తిట్టుకుంటూ కూర్చోలేదు...
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్నా సైన్యంముండునా అని అనుకుంటూ... తనకు చేతనైనది చేస్తూ  ఇదిగో బుట్టలు అల్లుకుంటూ చిరుగులుపడ్డ తన జీవన వాస్తవాలకి కుట్లు వెయ్యటానికి కృషి చేస్తోంది..... 

ఇలాంటి బుట్టలే మీరు పెద్ద మాల్స్ లో కొని ఇంట్లో పెట్టుకుంటారు కాని ఈవిడ దగ్గరే ఎందుకు కొనరో అర్ధం కాదు...  సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలలా మీరందరు?? కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే?? అని మీ మనస్సాక్షి మౌనం గా ప్రశ్నించక మానదు....
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కూర్చోకుండా తనకి చేతనైన పని చేస్తూ వెలుగు లేని తన జీవితంలో నిలబడేందుకు ప్రయత్నిస్తుంది....  మీరు తనకి దారి చూపక్కర్లేద్దు... దరి చేరి ఓదార్చక్కర్లేద్దు... ఆమె నడకకు  ఆసరా అయితే చాలు... పంచే గుణమే ‘money’షి  నిమనిషిగా చేస్తుంది...
ఎప్పుడైనా మార్తహళ్లి (బెంగుళూరు) నుంచి Old  Airport రోడ్ కి వెళ్తున్నప్పుడు Brandfactory దగ్గరలో చూడండి, మీరు నమ్మలేనంత వేగం తో ఆమె అల్లుతూ మీ కళ్ళకు పని  అప్పజెపుతుంది... చాలా మందిలా  చీకటిని చూస్తూ  తిట్టుకోకుండా  చిన్న  జ్యోతిని వెలిగించుకునే ప్రయత్నం చేస్తోన్న ఆమెకు..... అందరిలా చూసి వెళ్ళిపోకుండా చేయి చేయి కలిపి చేయూతనిస్తారని ఆశిస్తూ......


Thursday, October 4, 2012

మహాత్ముడైనా క్షమించగలడా?


1948 జనవరి 30 జవహర్ లాల్ నేహ్రూ రేడియోలో అన్న మాటలు "మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించి, చీకటి అలుముకొన్నది. ఏమి చెప్పటానికీ నాకు మాటలు కరవయ్యాయి. మన జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించడు. మనను ఓదార్చి, దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకూ, కోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము"... కాని ఇప్పుడు జాతి వారసులు అపహాస్యంగా అంటున్న మాటలు "భారతదేశానికి స్వాతంత్ర్యం గాంధీ వల్ల వచ్చిందా? గాంధీ వల్ల ఆలస్యమైందామహాత్ముడి నిజస్వరూపం ఏమిటి? దేశానికి గాంధీ వరమా? శాపమా?"... ఆయన గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా బురద జల్లటానికి ప్రయత్నించేవారే...  ఏదేమైనా గాంధీ 'నాయకత్వం'లో భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చిందనేది చరిత్ర తెలిపిన సత్యం....

"ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు" అని ఐన్ స్టీన్ అన్నా, "జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు" అని మార్టిన్ లూధర్ కింగ్ అన్నా, "మహాత్మా గాంధీ ప్రపంచానికి హీరో" అని ఒబామా అన్నా,  మనకి మాత్రం ఆయన మీద ఎప్పుడూ తడుముకోకుండా తరుముకొచ్చే అనుమానాలే... ఆయన తెచ్చిపెట్టిన స్వతంత్ర ఫలాలు ఏంటంటే గాంధీ ని ఏమైనా అనచ్చు, గాడ్సేకి తాము వారసులుగా ప్రకటించుకోవచ్చు.... ఆయన పుట్టిన రోజున "డ్రై డే" అని తిట్టుకొనూవచ్చు...

"
అహింసకు మించిన ఆయుధం లేదు" అని అన్న ఆయన మాటకు చాలా విలువిచ్చి ఎంతో మారణహోమం సృష్టించిన వాళ్ళని కూడా క్షమాబిక్ష పెట్టటానికి చేయని ప్రయత్నం లేదు.... "ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు" అని అన్న మాటకి అంతే విలువిచ్చి ఆడది ఒంటరిగా ఎందుకు తిరగటం అని ఎంతో గట్టిగా ప్రశ్నిస్తున్నాం.... "సత్యాగ్రహానికి ఎంతో శక్తి ఉంది" అని చెప్పిన మాటని బాగా ఒంటబట్టించుకుని ప్రతి రాజకీయ అవసర అవలక్షణాలన్నీ సత్యాగ్రహం మాటతో కడిగేస్తున్నాం... "మద్యం మహమ్మారిని తరిమి కొట్టమనిచెప్తే ఊరికొక  వీధి పేరు గాంధీ అని పెట్టి  వీధిలోనే మద్యం షాపులు తెరిపించేసి ఆయన ఋణం బాగానే తీర్చుకుంటున్నాం.... ఇన్ని చేస్తున్నా మనకి ఆయన మీద అభిమానం మాత్రం ఇంకా  చావలేదు అందుకే ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం తో ఏదో విధంగా ఆయన మీద బురద జల్లుతూ వివాదాల సుడిగుండం లోకి లాగుతూనే ఉంటాం.....

గాంధీ జయంతి రోజునో, వర్ధంతి రోజునో తప్ప మిగిలిన రోజుల్లో మన రాజకీయ కీచకులకు గాంధేయ వాదం గుర్తుకు రాదు.... గాంధీ టోపీ తలపై ధరిస్తారుసత్యాగ్రాహాల పేరుతో ప్రభుత్వ ఆస్తులు తగలబెడతారు, ఇవన్నీ చేసాక కూడా మాదీ గాంధేయ వాదమే అంటారు...  ఇలాంటి సమాజాన్ని చూడటానికేనా అహర్నిశలు  కష్టపడింది, ఉప్పు సత్యాగ్రహాలు చేసింది, క్విట్ ఇండియా అంటూ ఉద్యమించింది... తెగించి తెచ్చుకున్న స్వతంత్రం కాస్తాస్వాహా’తంత్రం గా అయిపోతున్నా ఏమి పట్టనట్టు నిదురపోతున్న జాతిని చూసి మహాత్ముడు క్షమిస్తాడా? క్షమిస్తాడేమోలే ఎంతైనా మహాత్ముడు కదా....

గాంధీ మీద ఎన్నో అపవాదులు వేసి, వివాదాలు సృష్టిస్తూ పబ్లిసిటీ తెచ్చుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు చాలా మంచి... కాని ఇవన్నీ నిజమే అని తేలితే ఏమవుతుంది?? మహా అయితే ఆయనా మనలా మాములు మనిషే అని తెలుస్తుంది అంతే తప్ప అయన ఇమేజికి వచ్చే ముప్పేమీ లేదు.... 
He will always be remembered for what he contributed to humanity rather than what he is as an individual....


జ్ఞాపకాల ఆల్బం


జ్ఞాపకాల ఆల్బం తిరగేస్తుంటే....
     మరక పడ్డ చిత్రాన్ని చూసి.... 
          ఆప్యాయత కన్నీరు నింపింది.... 
               తొందరపాటు పశ్చ్యాత్తాపం చెందిది....

కాలం మనసుని తడుముతూ ఉంటే.... 
     మరపురాని గతాన్ని చూసి.... 
          అనురాగం ఆనందాన్ని పంపింది.... 
               నిరాశ స్వాగతం పలికింది....

అనుభూతుల డైరీ చూస్తుంటే....
     చెదలు పట్టిన పేజిని చూసి.... 
          అభిమానం వెన్నుతట్టింది.... 
               అనుభవం అంటిపెట్టుకుంది....

ఆలోచనలు మనసును తవ్వుతూ ఉంటే....
     బయట పడ్డ స్మృతులను చూసి.... 
          ఆవేశం సిగ్గు తో తల  దించుకుంది....
               ఆవేదన ఆర్తి గా వాటేసుకుంది....