Friday, September 28, 2012

తప్పదు మీకీ చింత


నా కవిత ...
ఇప్పుడు మీ చెంత... 
కొందరికి కవ్వింత... 
ఇంకొందరికి తుళ్ళింత...
మరికొందరికి నవ్వింత...
ఇది బాలేదు అంటే తంత...  
మెచ్చుకోకపోతే కొడత...
ఇప్పుడైనా మెచ్చుకోండి కొంత...
ఏదైనా తప్పదు మీకీ చింత...
ఇంక పాడండి వంత...

Thursday, September 27, 2012

సుస్వరాగాలు పంచిన సాయంత్రం


మరుసటి రోజు హైదరాబాద్ లో ఇళయరాజా సంగీత విభావరి అని తెలిసినప్పటి నుంచి  హైదరాబాద్ వెళ్ళటానికి చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు, కాని హైదరాబాద్ వెళ్ళటం మాత్రం కుదరకపోయేసరికి అప్పటి నుంచి అన్ని ఆ ఆలోచనలే... ఇళయరాజా గారి దర్శనం మరలా  ఎప్పుడో అని…  అంతలోనే ఆ తర్వాత రోజు ఉదయం పెద్ద హోర్డింగ్ చూసా బెంగుళూరు లో  సెప్టెంబర్ 23 న గణేష్ ఉత్సవ్ లో ఇళయరాజా concert అని…. అది చూసినప్పటినుంచి నా ఆనందానికి అవధులు లేవు…. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులే... మొత్తం మీద రానే వచ్చింది ఆ రోజు....

షార్జా లో మొదటి సారి ఆయన దర్శన భాగ్యం కలిగినా, రెండో సారి ఆయన సంగీత విభావరికి వెళ్ళటానికి మూడేళ్ళు వేచిచూడాల్సి వచ్చింది… పొద్దుట నుంచి  రెడీ అయిపోయాం సాయంత్రం concert కోసం… సాయంత్రం నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్ కి  వెళ్ళేసరికి  ఒక మోస్తరు గా ఉన్నారు జనాలు అప్పటికే... అది ఫ్రీ concert అని చదివి టికెట్స్ ఉండవు అని పొరపాటు పడి టికెట్స్  గురించి  కనుక్కోలేదు కొనుక్కోలేదు... అది అందరు నుంచుని చూసే ఫ్రీ ప్రోగ్రామే అయినప్పటికీ దగ్గరగా కూర్చుని చూడటానికి టికెట్స్ ఉన్నాయి.... అంతే ఇంకేమి ఆలోచించకుండా ఎంతో అని అడగకుండానే టికెట్స్ తీసేసుకున్నాం.. లెక్క చూసుకున్న తర్వాత  తెలిసింది ఒక్కోటీ 1500 అని... రాజా గారి దర్శనం ముందు ఈ లెక్కలొక  లెక్కా?? అని అనుకుంటూ టికెట్స్ ఎంట్రీ గేటు లోకి వెళ్లేసరికి అక్కడ జన సంద్రం చూసి భయమేసి భాధేసి కుంచెం ముందే రావాల్సిందని అనిపించింది.  అటు ఇటు చూసుకుంటూ క్యూ మధ్యలో దూరిపోయాం... వెనకవాళ్ళు కన్నడ లో తిట్టుకున్నారు  మమ్మల్ని, కాని పాపం వాళ్ళకేం తెలుసు మాకు కన్నడ రాదని....  మొత్తం మీద  అలా ఇలా తోసుకుంటూ  లోపలికి  వెళ్ళిపోయాం, మంచి  వ్యూ  చూసుకుని  కుర్చీలలో  సెటిల్  అయిపోయాం.... 

కూర్చోగానే చిన్నగా నాదస్వరం మొదలయ్యింది.. అది అలా సాగుతూ  ఉంటే  స్టేజి  పైకి ఒక్కొక్కరు వచ్చి తమ తమ కుర్చీలలో కూర్చోవటం మొదలు పెట్టారు... మొత్తం మీద ఒక 60 మంది ఉంటారు... అది రాజా గారి orchestra... మొత్తం అందరూ వచ్చి కూర్చుని తమ తమ వాయిద్యాలను శృతి చేసుకోవటం మొదలు పెట్టారు... అందరూ ఒకేసారి శృతి చేసుకుంటున్నారేమో అది వినటానికి సంధ్యవేళలో పక్షులు గూటికి చేరుతూ చేసే కిలకిలరావాలలా అనిపించింది… అవును రాజా గారి concert లో చిన్న శబ్ధాలు కూడా మనలో vibrations కలిపించక మానదు....

శృతి చేసుకున్న తర్వాత అందరూ కలిసి వాయించటం మొదలు పెట్టారు... చిటపట చినుకులు గా మొదలైన ఆ ధ్వని మొత్తం గ్రౌండ్స్ అంతా వ్యాపించి తుఫానులా విజ్రుంభించి  ఒక్కసారిగా ఆగిపోయింది... వెంటనే అర్ధం అయింది రాజా గారు  స్టేజి పైకి రాబోతున్నారు అని... చీకటిని చీలుస్తూ వచ్చే సూర్యుడిలా, నిశ్శబ్ధాన్ని చేధిస్తూ వస్తున్నారు ఇళయరాజా గారు  తెల్లని వస్త్రాలలో తపస్విలా... నా గుండె వేగం పెంచింది, రాజా గారిని మరలా చూసే ఆ మధుర క్షణం వచ్చేసింది అని... అలా మెట్లు ఎక్కుతూ రాజా గారు స్టేజి పైకి చేరుకోగానే గ్రౌండ్ అంతా  జనాల చప్పట్ల హోరుతో మార్మ్రోగిపోయింది... నాకు తెలియకుండానే నా చేతులు రెండు జోడించి ఆయనకి నమస్కరించే  ఉన్నాయి.... చూపు మసకబారిపోతుందని చూసుకుంటే తెలిసింది నా కళ్ళు చెమర్చాయని... అందరికీ అభివాదం చేస్తున్న ఆ లయ రాజు ని చూసి ఇంక నా ఉద్వేగం తట్టుకోలేక కుర్చీలో కూర్చుని కొంచెంసేపు ఏడ్చేసా..... అది ఏడుపు కాదు ఆనంద బాష్పాలు…. ఆ సంగీత జ్ఞానిని చూసి పొంగిన స్వర గంగ...

ఆ కొంతసేపు నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియలేదు నా కళ్ళ నిండా కన్నీళ్లు ఆ కన్నీటిలో అభివాదం చేస్తున్న ఇళయరాజా నిలువెత్తు ప్రతిబింబం... కొంత సేపటికి తేరుకుని రాజా గారిని చూడటం మొదలు పెట్టా... ఆయన కోసం స్టేజి మీద ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్నారు ఎన్నో ఏళ్ళుగా  స్వర ప్రవాహాన్ని సృష్టిస్తున్న చిన్న హార్మోనియం పెట్టెని ముందు పెట్టుకుని....
అప్పుడు మొదలు పెట్టారు  అమ్మా అమ్మా అంటూ ఒక భక్తిగీతం...  భాష అర్ధం కాక ఆ పాట ఏ అమ్మ గురించో తెలియలేదు గాని భావం మాత్రం అర్ధం అయ్యింది ఆ స్వరాలలో... భక్తి భావం తొణికిసలాడింది...  
ఆ తర్వాత జనని జనని అంటూ మరలా ఆయనే అందుకున్నారు... ఆ రెండు గీతాలు ఆలపించాక స్టేజి మీద లైటింగ్ ఎక్కువ అవ్వడంతో నేను జనాలను చూడలేకపోతున్నా కొంచెం లైటింగ్ తగ్గించండి అని అడిగారు, తగ్గించాక చెప్పారు నన్ను కాదు మీరు చూడాల్సింది, నేను చూడాలి మిమ్మల్ని, మిమ్మల్ని చూడటానికే ఇక్కడికి వచ్చింది  అని ఎంతో అణకువతో చెప్పిన ఆ పద్మభూషణుడిని ఎలా అభినందించాలో అర్ధం కాలేదు... ఆ మాటలు విన్నాక చప్పట్లతో మరోసారి మార్మ్రోగిపోయింది  గ్రౌండ్స్ అంతా.... మీ కోసమే రెండు నెలల నుంచి ప్రాక్టిసు చేస్తున్నారు, మీరు వింటే చాలు... ఏ చిన్న శబ్ధం చేయకుండా లేకుండా వినండి, చప్పట్లు కూడా అక్కర్లేద్దు మీరు విని ఆనందించటమే కావాలి అని అన్నప్పుడు... ఏమిటి  ఈ మనిషి? చప్పట్లు కూడా కోరుకోని కళాకారుడు ఉంటాడా? ఆయన మనిషి కాదు మహానుభావుడు అని అనిపించింది... ఆ తర్వాత ఒక్కో గాయకుడు/గాయని తమ పాటలు పాడుతూ వెళ్ళటం దానికి సంబంధించిన విషయాలను ఇళయరాజా చెప్పటం చాలా ఆకట్టుకుంది...

ఒక కన్నడ పాట ( హే కవితే నీవు... రాగా నాను..) గురించి చెప్తూ ఆ పాటను ఇక్కడే లాల్ భాగ్ లో స్వరపరిచానని,  లాల్ భాగ్ లో కూర్చుని ఆ చిన్న హార్మోనియం  పెట్టెతో రాగాలు కట్టుకుంటూ ఉంటే ఎవరో అనుకుని పట్టించుకోలేదని చెప్తుంటే ఆయనతో పాటు అందరూ నవ్వేసారు...
ఇలయ నిలా పోళిగిరతేయ్  ( నెలరాజా పరిగడకూ - అమరగీతం) అని  సింగర్ మనో అందుకోగానే జనాలు కరతాళధ్వనులు మిన్నంటాయి.. అప్పుడు రాజా గారు మరలా గుర్తుచేశారు చప్పట్లు ఏమి కొట్టక్కర్లేద్దు విని ఆనందించండి చాలు అని....
ఎం ఇనియపోన్ నిలావే అంటూ విజయ ఏసుదాస్ వాళ్ళ నాన్నగారిని ఓసారి గుర్తుచేసాడు... ఈ పాట లో గిటార్ chords అసలు పాట ని మరిపించి మురిపించాయి....
రాజా కైయ వచ్చా ( రాజా చెయ్యి వేస్తే - విచిత్ర సోదరులు) అంటూ యువన్ శంకర్ రాజా ఒక ఊపు ఊపేసాడు.... నిజమే రాజా గారు చెయ్యి వేస్తే అది అపూర్వ స్వరమైపోతుంది... 
సిహిగాలి సిహిగాలి (ఆ దినగలు - కన్నడ ) పాట పాడుతున్నప్పుడు చెప్పారు, ఆ పాట షూటింగ్ అయిపోయిన తర్వాత దానికి తగ్గట్టు చేసిన పాట అది అని... సన్నివేశాలకి పదాలకి తగ్గట్టే కాదు డాన్సుకి తగ్గట్టు కూడా స్వరాలు చేసేస్తారు మాట ఈయన...
ఏ జిందగీ గలే లగాలే (వసంత కోకిల) పాడినప్పుడు, ఈ  పాట కేవలం ఐదు గంటలలో రికార్డింగ్  చేసేసాం అని చెప్పగానే ఆశ్చర్యం వేసింది, ఇంత మంచి పాటలు చేయటం ఆయనకి అంత తేలికా? అని...
ఒక్క తెలుగు పాటైనా వుంటే బావున్ను అని లోపల అనుకుంటున్నవిషయం తెలిసిందేమో మరి... ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా (గీతాంజలి) అని మొదలు పెట్టారు మనో మరియు గీతా మాధురి...  కళ్ళు మూసుకుని కూర్చుంటే ఈ పాటలు లైవ్ లో వస్తున్న పాటలా? రికార్డింగ్ చేసేసిన పాటలా? అనే తేడా చెప్పటం చాలా కష్టం... అంతటి స్పష్టత, పరిపూర్ణత ఉన్నాయి మరి…
నగువా నయనా మధురా మౌనా (కనులు కనులు కలిసే సమయం - పల్లవి అనుపల్లవి) పాట ముందు వచ్చే వయోలిన్ విన్యాసాన్ని చూసి (విని) జనాలు చప్పట్లతో అవధులు లేని తమ ఆనందాన్నితెలియజేస్తే ఈ సారి రాజా గారికి చిరు కోపం వచ్చింది.  Orchestra  వాళ్ళని మధ్యలోనే ఆపించేసి, మీ కోసమే రెండు నెలలుగా వీళ్ళందరు కష్టపడి ప్రాక్టిసు చేస్తున్నారు, మీరు ఇలా చప్పట్లు కొట్టేస్తే ఆ ధ్వనికి వాయిద్యాలు అన్ని ఒకేలాగ sync అవ్వవు, పూర్తిగా వినండి, పూర్తయ్యే వరకు ఏ శబ్ధం చెయ్యొద్దు అని వారించారు... మరలా మొదటి నుంచి మొదలుపెట్టి వినిపించారు.. అబ్బా ఆ వయోలిన్ తో విన్యాసం రాజా గారికి  తప్ప ఇంకెవరికి సాధ్యం? అందుకే అనేది మ్యూజిక్ మ్యాస్ట్రో అని...
ఈసారి జోతేయాలి జోతే జోతేయాలి (జానే దోనా - చీనికమ్)వంతు... పాట మొదలుపెట్టే ముందు ఆ సింగర్, రాజా గారి అనుమతి తీసుకుని, ఈ పాటకి కూడా మిమ్మల్ని ఆపటం కష్టం అందుకే పాట మొదలుపెట్టే ముందే  మీ అభిమానాన్ని తెలిజేసేయండి ఎంత సేపు కావాలంటే అంత సేపు అని జనాలని ఉద్దేశించి అనగానే చప్పట్ల తుఫానే మొదలయ్యింది... ఆ తుఫాను ఎంతకీ ఆగకపోయేసరికి ఇంక ఆ సింగర్ చేసేది ఏమి లేక ఆపమని బతిమాలుకున్నాడు.... రాజా గారి మీద అభిమానానికి హద్దులు  పెట్టడటం సాధ్యమేనా??
మరలా ఇంకో తెలుగు ముత్యాన్నివిసిరారు…బోటనీ పాటముంది మాటినీ ఆట ఉంది రూపంలో..
అలా ఇంకొన్ని తమిళ పాటలు కన్నడ పాటలు అవ్వగా… చివరగా ఈ గణేష్ ఉత్సవ్ కోసం ఆయన ప్రత్యేకంగా స్వరపరిచిన గణపన్న బారయ్యా  గణపన్న ఒక ఊపు ఊపింది...

పంచభక్షపర్వానాలు తినేసాక ఇంక ఆకలేయ్యదేమో గాని, ఈయన పాటలు ఎన్ని విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది తినిపిస్తుంటే తినాలనే అనిపిస్తుంది.... అంతం లేని ఆకలి అది....
కాని అప్పటికే 11:30 దాటిపోయేసరికి ఇంక ఆగిపోయింది ఆ సంగీత విభావరి మా అందరికి అమితానందాన్ని పంచి... మొత్తం మీద 26 పాటలు అందునా రాజా గారు స్వయంగా పాడిన 5 పాటలు... ఆహా! అన్నీ అమోఘమే.... మరలా ఎప్పుడో ఆయన దర్శనం అని అనుకుంటూ ఆయన పంచిన ఈ గానామృతాన్ని తలచుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాం భారమైన హృదయాలతో...

అప్పుడే చిలికిన వెన్నని ముద్దలు ముద్దలుగా చేసుకుని తింటే ఎలా ఉంటుందో...
విరుల తేనె చినుకుల వర్షం లో తడిసిముద్దైతే ఎలా ఉంటుందో...
పున్నమి వెన్నల నీడన గోదారి గట్టున నడిస్తే ఎలా ఉంటుందో... వీటిని అన్నిటిని కలిపి ఒకేసారి అనుభవింపజేసింది ఇళయరాజా గారి సంగీత విభావరి...

ఏడు పదుల వయస్సులో కూడా ఈ మహర్షి   సంగీతాన్ని మధిస్తూనే ఉన్నారు, అనంతమైన అమృతాన్ని రాబడుతూనే ఉన్నారు...  ఈ సంగీత జ్ఞానికి  ఒక సాష్టాంగ నమస్కారం తప్ప ఇంకెలా నా అభిమానాన్ని చాటగలను??


Saturday, September 22, 2012

నేనూ బ్లాగర్ని అయ్యానోచ్

ఎప్పటినుంచో బ్లాగు రాద్దామా వొద్దా అని ఆలోచిస్తూనే ఉన్నా కాని చివరికి బ్లాగే నెగ్గింది... దాని పర్యవసానమే ఈ నా మొదటి బ్లాగు... ఇంక మీకు తప్పదు నా పిచ్చి రాతలు పచ్చి కథలు వినాల్సిందే చదవాల్సిందే.... మొదలంటే పెట్టా గాని ఏమి రాయాలో తెలియలేదు.. కాని ఏదో రాయాలనే తపన... ఈ బ్లాగరుల విషయ జ్ఞానం చూసి నా సామర్ద్యం తెలిసి నిరాశే వేసింది అందులో వింతేముంది అలవాటైనదే కదా.... సాగర మధనం మొదలవగానే మొదట విషమే వచ్చినా విసుగు చెందక చిలికించగా అమృతమే వచ్చేసిందిగా... చూద్దాం నా మనసుని చిలికిస్తే ఏమొస్తుందో... కాని ఈ నా బ్లాగు మొదలు పెట్టింది మాత్రం గతమైన జీవితాన్ని కథలా రాసుకుని మనసైనప్పుడు చదువుకుందామని....

నా ఈ పయనానికి మీరూ తోడుగా వస్తారని ఆశిస్తూ....