Friday, December 28, 2012

మధురాతి మధురం - మధుర


ఎలాగూ ఢిల్లీ లో ఉన్నాం కదా అని ఆగ్రా వెళ్దామని అనుకుని ముందు రోజు గూగులమ్మ సాయం తీసుకున్నా…. తర్వాత తెలిసింది మథుర, గోకులం దారిలోనే అని... అది తెలిసాక ఆగ్రా సంగతి మరచిపోయి మథుర గురించి వెతకటం మొదలు పెట్టాం... నెట్ లో మథుర గురించి గోకులం గురించి పెద్దగా సమాచారం దొరకకపోయినా మేము నిర్ణయించేసుకున్నాం మథుర వెళ్ళిపోవాలని, శ్రీకృష్ణ జన్మ స్థానం చుసేయ్యాలని... 

అనుకున్నట్టే ఉదయం 6:30 కి మొదలయ్యాం ఢిల్లీ నుంచి కారు లో, చలిని పెద్ద లెక్క చెయ్యకుండా.... యమునా ఎక్స్ ప్రెస్ వే 6 లేన్ రహదారిఎప్పుడో అప్పుడప్పుడు పలకరించే కార్లు తప్ప రోడ్డంతా ఖాళి గా ఉంది.... చుట్టూ దుప్పటిలా పరుచుకున్న తెల్లని మంచు, దాని చీల్చుకుంటూ తన లైట్ల నే వెంబడిస్తూ మా కారు....  

8:30కి, అంటే కేవలం రెండు గంటల్లో, మధుర  చేరుకున్నాం... మధుర చేరుకున్నామో లేదో ఎక్కడ చూసినా ఆవులు, ఆవు దూడలు... అక్కడక్కడ  పెద్ద రోడ్లు ఉన్నా, కొంచెం పల్లెటూరు వాతావరణమే కనిపించింది... మధుర ఊరిలోకి వెళ్తూనే ఒక గైడ్ ని పెట్టుకున్నాం.... గైడ్ చెప్పటం మొదలు పెట్టాడు, యమున కి ఇవతల మధుర, అవతల గోకులం అని... మధుర శ్రీకృష్ణ జన్మ స్థానం అని, పెరిగిన స్థలం గోకులం అని గైడ్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు... ఇంతలో చిన్న బ్రిడ్జి రాగానే చెప్పాడు, ఇదే యమున నది అని, నదే శ్రీ కృష్ణుడిని దాటించటానికి మార్గం ఇచ్చింది అని.. అలా చెప్పగానే ఓసారి అలా దాటుకుంటూ వెళ్తున్న చిన్నికృష్ణుడిని, వసుదేవుడుని ఉహించేసుకుని మురిసిపోయాం.... 

యమునమ్మని దాటుకుని గోకులం చేరుకున్నాం... ముందు గోకులం లో ఒక ఆశ్రమం చూసాం... చుట్టూ పక్కలనే అట  శ్రీకృష్ణుడు గోపబాలురతో ఆవుల్ని మేపుతూ ఆనంద లీల సాగించింది.... గోకులం లో ఎక్కడ చూసినా ఆవు దూడలే..... ఆశ్రమానికో గుడికో వచ్చినట్టు లేదు ఆవులు పెంచుతున్న చోటు లో ఉన్నట్టుగా ఉంది.... ఎటు చూసినా చిన్న చిన్న ఆవు దూడలు.....

అది చూసుకున్న తర్వాత నందవ్రజం చేరుకున్నాం.... అదే నందుని ఇల్లు... అంటే దేవకి ఇంటి పంట అయిన  చిన్ని కృష్ణుడు యశోద ఇంట పెరిగిన స్థలం... ఇల్లు ఇంకా అలాగే ఉందట.. ఒక ఆశ్చర్యకర విషయం చెప్పాడు గైడ్, ఇల్లు మొత్తం 84 స్థంబాలతో దేవతలు నిర్మించారని శాసనాలలో ఉన్నదని, కాని ఎవరైనా లెక్కపెడితే 84 కన్నా ఎక్కువగాని తక్కువగాని లెక్క తేలతాయే కాని 84 గా మాత్రం లెక్క పెట్టలేరు అని చెప్పగానే విని ఆశ్చర్యం వేసింది... లెక్కేద్దాం అనుకున్నా గాని గైడ్ పారిపోతుంటే పట్టుకునే పనిలో పని మరచిపోయా.... అక్కడే ఉన్న పూతన ని వధించిన స్థలం, కన్నయ్య కాలం నుంచి వస్తున్న రావి చెట్టు ని  చూపిస్తే చూసి మురిసిపోవటం మా వంతయ్యింది...   అక్కడ చిన్న కన్నయ్య దర్శనం చాలా చమత్కారం గా ఉంటుంది... చిన్న కన్నయ్య ఉయ్యాలలో ఊగుతూ ఉంటే అది దర్శించటానికి మనం పాకుతూ నవ్వుకుంటూ వెళ్ళాలి... భలే సరదా వేసింది అలా పాకుతూ వెళ్తుంటే.. చాల రోజులయ్యింది గా మరి... 

అలా చిన్ని కన్నయ్య దర్శనం చేసుకుని, కృష్ణుడు పెరిగిన ఇంటిని చూసుకుని మెల్లిగా బయటికి వచ్చాం మధుర లో శ్రీకృష్ణ జన్మ స్థానం చూసే పని లో.... దారిలో గైడ్ చెప్పుకుంటూ వస్తున్నాడు,  మధుర, గోకులం, బృందావనం చుట్టుపక్కల మొత్తం 5500 గుళ్ళు ఉన్నాయని... ప్రజాపరిక్రమ అని మధుర, గోకులం, బృందావనం అలా మొత్తం కృష్ణుడి జీవిత కాలానికి సంబందించిన అన్ని ప్రదేశాలు చుట్టబెడుతూ ఇంచుమించు 270 కిలోమీటర్లు  కాలినడకన ప్రదక్షిణ చేస్తారని .. ఇక జన్మాష్టమి రోజులలో అయితే ఇసుక వేస్తే రాలని జనమని, అదిగో అదే కృష్ణుడిని రోలు కి కడితే దానిని లాక్కుంటూ వచ్చి రెండు పెద్ద చెట్లని పడగొట్టిన స్థలం అని,  ఇలా ఒకటేమిటి ఎక్కడ చూసినా శ్రీకృష్ణుని కి సంబందించిన విశేషం ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి మూడు ఊళ్ళల్లో అని చెప్తూ ఉంటే ... అవన్నీ వింటూ మా కళ్ళకి పని చెప్తూ ఉహించేసుకుంటూనే వున్నాం.... 

అంతలోనే మధుర లో శ్రీకృష్ణ జన్మ స్థానం రానే వచ్చింది... ఇక గైడ్ మా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.... గోకులంలో మధురలో మరెక్కడా  సెక్యూరిటీ లేకపోయినా శ్రీకృష్ణుడి జన్మ స్థానమనేమో గాని సెక్యూరిటీ ఎక్కువగానే ఉంది... కెమెరా, సెల్ ఫోన్ అన్ని క్లోక్ రూమ్ లో పెట్టేసి మెల్లిగా లోపలి నడుచుకుంటూ వెళ్లాం.... వెళ్ళగానే కుడిచేతి వైపు పెద్ద గోడ... గోడ కి అటు వైపు పెద్ద మసీదు, ఇటు వైపు కృష్ణుడు పుట్టిన చోటు....   శ్రీకృష్ణ జన్మస్థానం అంటే అందరూ అన్నట్టుగానే చిన్న జైలు లా ఉంది... ఒక్కరే పట్టేంత సన్నని ఇరుకైన సంధు లాంటి చీకటి కారిడార్ లో నడచుకుంటూ వెళ్తే ఒక గది... అందులో రాతి గట్టు.. అదే శ్రీకృష్ణ జన్మ స్థానం..... చుట్టూ ఎలా ఉన్నా ఓసారి అక్కడికి వెళ్ళగానే రాయి ముట్టుకోగానే ఏదో తెలియని పులకింత... మరలా రాగలమో లేదో అని ఓసారి మనసారా రాతి గట్టు తడిమేసి బయటికి వచ్చాం వెనకాల వాళ్ళు తోసేస్తే.... బయటికి రాగానే పెద్ద హాల్ దాంట్లో రాధ కృష్ణుల తెల్లని విగ్రహాలు... ఎంతో సమ్మోహనం గా ఉన్నాయి... అవే కాకుండా చుట్టూ మా సీతా రాములు, అమ్మవారు, పరమేశ్వరుడి విగ్రహాలు అన్ని చూడముచ్చటగా ఉన్నాయి.... అవన్నీ చూసుకుంటూ అమితానందం తో బరువెక్కిన హృదయాలతో బయటికి వచ్చాం ఆగ్రా వెళ్ళే పని లో....  (ఆగ్రా అనుభవాలు, నన్ను దోచుకోని తాజ్ మహల్ గురించి వేరే టపా లో కుదిరితే...) 


మధురలో గాని, గోకులంలో గాని ఎక్కడా కళ్ళు చెదిరిపోయే కట్టడాలు లేకపోయినా, శ్రీకృష్ణుడు నడయాడిన భూమి అనో .... చిన్నికన్నయ్య ఆనంద లీల సాగించిన నేల అనో ... బాల గోపాలుడు తన వేణుగానాన్ని పంచిన పలికించిన గాలి కావటం చేతనో ఏదో తెలియని ఆనందం ఎంతో తియ్యని అనుభూతి... నిజ్జంగా మధుర మధురాతి మధురం.....