Sunday, November 17, 2013

మా భారతరత్నం - సచిన్ టెండూల్కర్


చిరుజల్లుల ఆహ్లాదం వర్షం వెరిసే కొంతసేపే…. అప్పుడే విచ్చుకున్న పువ్వు పరిమళం, అది వాడిపోయే ఆ కొంతసేపే…. ఆరుబయట పండువెన్నెల ఆస్వాదం కూడా ఆ ఒక్క రాత్రి వరకే....  కాని యిరవై నాలుగు సంవత్సరాలు ఒక వ్యక్తి తన ఆటతోను, తన వ్యక్తిత్వం తోనూ అలరిస్తూనే ఉన్నాడు, మన చేత ఆస్వాదింపజేయిస్తూనే ఉన్నాడు….

సచిన్ టెండూల్కర్’…. కొన్ని దశాబ్ధాలు అదొక తారక మాత్రంలా వెన్నంటే ఉన్న పేరు, తన జ్ఞాపకాలనే మరిపిస్తూ మురిపిస్తూ ఉన్న పేరు…. పసిపిల్లల నుంచీ పండుముదుసలుల వరకూ అందరికీ తెలిసిన పేరు... ఇంకా చెప్పాలంటే, అసలు పరిచయమే అక్కర్లేని పేరు క్రీడ కన్నా ఎక్కువ అభిమానాన్ని సంపాదించుకున్న పేరు….

చిన్నప్పుడు క్రికెట్ చూడటం అలవాటైనప్పటి నుంచి వదలని పేరు సచిన్…. నాలాంటి చాలా మంది సగటు అభిమానులకు అసలు క్రికెట్ అంటే ఇష్టం పెరిగింది, చూడటం పెరిగింది కేవలం సచిన్ వల్లనే అంటే అతిశయోక్తి కాదేమో…. రెండు దశాబ్ధాల నుంచి ఉన్న ఈ అభిమానం, మన పక్కింటి కుర్రాడు లా, సచిన్ గాడు ఎంత కొట్టాడ్రా?, సచిన్ గాడు ఉన్నాడా లేడా? అయ్యో సచిన్ గాడు ఔటా? అనటం నుంచి సచిన్ మా క్రికెట్ గాడ్ అని అనిపించేలా చేసింది.. కాదు కాదు ఆరాధించేలా చేసింది….

అసలు సచిన్ నుంచి ఏం నేర్చుకోవాలి, ఏమి చూడాలి? అతడి ఆట? లేకా అతడి ఆటిట్యూడా? రెండూనూ…. సచినుడి ఆట గురించి చెప్పుకోవటానికి కొన్ని వందల జ్ఞాపకాలు…. ఇసుక తుఫాన్ల దేశం లో పరుగుల తుఫాను పుట్టించిన ఆట గురించి చెప్పుకోవాలా? ఇళయరాజా ట్యూన్ లాంటి కవర్ డ్రైవ్ గురించా?  స్ట్రెయిట్ లైన్ కి ఉన్న వంకర్లు దిద్దిన స్ట్రెయిట్ డ్రైవ్ గురించా?  పువ్వుని తాకినట్టు ఆడే అప్పర్ కట్ గురించా? వన్ డే మ్యాచ్ లలో మొట్ట మొదటి డబల్ సెంచరీ గురించా, వంద వందలు చేసిన అలుపెరుగని ఆట గురించా? ప్రపంచకప్ లలో పూనకం వచ్చిన కుర్రోడిలా చెలరేగిపోయే ఆట గురించా?..... తన ఆట గురించి  చెప్పటానికి మాటలు సరిపోవు గాని, తన క్రికెట్ షాట్స్ ప్రాణం పోస్తే అవే ఎలుగెత్తి చాటుతాయేమో, కాని ఆ పని చెయ్యగల సమర్ధుడు ఎవరు? ఈ సచినుడు తప్ప….

సచిన్ ని మరింత ఉన్నత స్థాయికి నిలబెట్టింది తన వ్యక్తిత్వం…. అతడు మాట్లాడడు…. ఆడతాడు…. ఎందరో ఎన్నో సార్లు మైదానం లోపలా బయటా గొంతు చించుకున్నా, ప్రతీసారి తన ఆట తోనే సమాధానం చెప్పాడు…. ఎప్పుడు తన నోరు మాత్రం జార లేదు…. బ్రెట్ లీ, మెగ్ గ్రాత్ లాంటి వాళ్ళు ఎన్నో సార్లు రెచ్చగొట్టినా, వకార్ లాంటి బౌలర్స్ రక్తం వచ్చేలా గాయం చేసినా…. ఎన్నో మేటి మేగజైన్స్ సచిన్ పని అయిపోయిందా అని ఎన్ని సార్లు పెద్ద ఆర్టికల్స్ రాసినా అన్నిటికి తన ఆటతోను, బాట్ తోనే సమాధానం చెప్పాడు గాని ఎన్నడూ తన వ్యక్తిత్వానికి మాత్రం మచ్చ తెచ్చుకోలేదు ఈ సచ్చీలుడు.....

2004 లో, ఔట్ లుక్ మేగజైన్ Sachin-End-ul-kar అనే వ్యాసం రాసి సచిన్ శకం ముగియబోతుందా అని రాసినా, 2006 లో టైమ్స్ అఫ్ ఇండియా ఇదే విధం గా End-ul-kar అని కాప్షన్ పెట్టినా, తన నిగ్రహణ మాత్రం కోల్పోకుండా, ఎప్పుడూ తన ప్రజ్ఞే చూపించాడు…. End-ul-kar పదం పుట్టిన ఆనాటి నుంచి ఇప్పటి వరకు, కొన్ని వేల పరుగులు చేసాడు, దాదాపు ముప్పై కి పైగా సెంచురీలు చేసాడు…. వాళ్ళ అమాయకత్వం కాకపోతే, ఏ బంతిని ఎలా కొట్టాలో తెలిసిన క్రీడాకారుడికి ఆటను ఎప్పుడు ముగించాలో ఒకరు చెప్పే అవసరం ఉంటుందా??

అయినా, సచిన్ ని పరుగులతో కొలవటం జనాలు ఎప్పుడో మరచిపోయారు, కాదు కాదు విడిచిపెట్టేసారు…. ప్రతీ మ్యాచ్ లోనూ తనదైన ముద్ర వేస్తూ, సగటు ప్రజల ఉద్వేగాల్లో ఉత్సాహం నింపుతూ అలసట ఎరుగని పయనం సాగించాడు…. కాని సచిన్ అభిమానించింది కేవలం అతని ఆటని చూసి మాత్రమే కాదు, ఎన్ని చేస్తున్నా తనని తాను మలచుకున్న తీరు, మచ్చ లేకుండా చెక్కుకున్న తన వ్యక్తిత్వం,  పెరగటమే గాని తగ్గని వినయం…. అందుకే యావత్ భారతదేశం తనతో, తన ఆటతో తాదాత్మ్యం చెందిది, తన కోసం ప్రార్థించింది…. దేవుడు అనేటంతటి స్థాయికి తీసుకెళ్ళింది….

ఎన్నో సార్లు కేవలం సచిన్ బాటింగ్ చూడటానికి తెల్లవారు ఝామున లేచిన మత్తు ఇంకా వదల్నే లేదు…. కొన్ని సంవత్సరాల క్రితం షార్జా లో వచ్చిన సచిన్ తుఫాను తడి ఇంకా మనసు నుంచి పోనేలేదు, కళ్ళు చేదిరే స్ట్రైట్ డ్రైవ్, కవర్ డ్రైవ్ లు ఇంకా కళ్ళను వీడనే లేదు కానీ ఇంతలోనే క్రికెట్ ప్రపంచం నుంచి సచిన్ విరమణ….    
ఒక సగటు అభిమాని కలలో కూడా ఊహించని ఆ క్షణం…. భారత్ గెలిచినా, అందరి కళ్ళు అతని వైపే ఆత్రుతగా చూసే ఆ క్షణం…. ఉబికివస్తున్న తన ఉద్వేగాన్ని అణుచుకుంటూ, తన్నుకొస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ తను అడుగులు వేస్తున్న ఆ క్షణం…. నాలాంటి కొన్ని కోట్ల అభిమానుల కన్నుల్లోనూ కన్నీటి సుడులు తిరిగుతూ ఉన్న ఆ క్షణం…. ఇక సెలవు అంటూ అభివాదం చేసిన ఆ క్షణం…. కాని అది ఆటగాడిగా మాత్రమే విరమణ, సచిన్ కి కాదు, అతని ప్రభావానికి అంతకంటే కాదు…. సచిన్ పంచిన జ్ఞాపకాలు, అనుభూతులు, ఆఖరికి తన చివరి స్పీచ్ ఎప్పటికీ పదిలం మా గుండెల్లోనే….


రిటైర్ అయినా…. అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఈ మాస్టర్ బ్లాస్టర్…. హృదయాల్లో ఎప్పటికీ నాటౌటే…. అందుకే ఇంతింతై సచినింతై పద్మవిభూషనుడై, భారతరత్నమయ్యాడు….