Sunday, November 17, 2013

మా భారతరత్నం - సచిన్ టెండూల్కర్


చిరుజల్లుల ఆహ్లాదం వర్షం వెరిసే కొంతసేపే…. అప్పుడే విచ్చుకున్న పువ్వు పరిమళం, అది వాడిపోయే ఆ కొంతసేపే…. ఆరుబయట పండువెన్నెల ఆస్వాదం కూడా ఆ ఒక్క రాత్రి వరకే....  కాని యిరవై నాలుగు సంవత్సరాలు ఒక వ్యక్తి తన ఆటతోను, తన వ్యక్తిత్వం తోనూ అలరిస్తూనే ఉన్నాడు, మన చేత ఆస్వాదింపజేయిస్తూనే ఉన్నాడు….

సచిన్ టెండూల్కర్’…. కొన్ని దశాబ్ధాలు అదొక తారక మాత్రంలా వెన్నంటే ఉన్న పేరు, తన జ్ఞాపకాలనే మరిపిస్తూ మురిపిస్తూ ఉన్న పేరు…. పసిపిల్లల నుంచీ పండుముదుసలుల వరకూ అందరికీ తెలిసిన పేరు... ఇంకా చెప్పాలంటే, అసలు పరిచయమే అక్కర్లేని పేరు క్రీడ కన్నా ఎక్కువ అభిమానాన్ని సంపాదించుకున్న పేరు….

చిన్నప్పుడు క్రికెట్ చూడటం అలవాటైనప్పటి నుంచి వదలని పేరు సచిన్…. నాలాంటి చాలా మంది సగటు అభిమానులకు అసలు క్రికెట్ అంటే ఇష్టం పెరిగింది, చూడటం పెరిగింది కేవలం సచిన్ వల్లనే అంటే అతిశయోక్తి కాదేమో…. రెండు దశాబ్ధాల నుంచి ఉన్న ఈ అభిమానం, మన పక్కింటి కుర్రాడు లా, సచిన్ గాడు ఎంత కొట్టాడ్రా?, సచిన్ గాడు ఉన్నాడా లేడా? అయ్యో సచిన్ గాడు ఔటా? అనటం నుంచి సచిన్ మా క్రికెట్ గాడ్ అని అనిపించేలా చేసింది.. కాదు కాదు ఆరాధించేలా చేసింది….

అసలు సచిన్ నుంచి ఏం నేర్చుకోవాలి, ఏమి చూడాలి? అతడి ఆట? లేకా అతడి ఆటిట్యూడా? రెండూనూ…. సచినుడి ఆట గురించి చెప్పుకోవటానికి కొన్ని వందల జ్ఞాపకాలు…. ఇసుక తుఫాన్ల దేశం లో పరుగుల తుఫాను పుట్టించిన ఆట గురించి చెప్పుకోవాలా? ఇళయరాజా ట్యూన్ లాంటి కవర్ డ్రైవ్ గురించా?  స్ట్రెయిట్ లైన్ కి ఉన్న వంకర్లు దిద్దిన స్ట్రెయిట్ డ్రైవ్ గురించా?  పువ్వుని తాకినట్టు ఆడే అప్పర్ కట్ గురించా? వన్ డే మ్యాచ్ లలో మొట్ట మొదటి డబల్ సెంచరీ గురించా, వంద వందలు చేసిన అలుపెరుగని ఆట గురించా? ప్రపంచకప్ లలో పూనకం వచ్చిన కుర్రోడిలా చెలరేగిపోయే ఆట గురించా?..... తన ఆట గురించి  చెప్పటానికి మాటలు సరిపోవు గాని, తన క్రికెట్ షాట్స్ ప్రాణం పోస్తే అవే ఎలుగెత్తి చాటుతాయేమో, కాని ఆ పని చెయ్యగల సమర్ధుడు ఎవరు? ఈ సచినుడు తప్ప….

సచిన్ ని మరింత ఉన్నత స్థాయికి నిలబెట్టింది తన వ్యక్తిత్వం…. అతడు మాట్లాడడు…. ఆడతాడు…. ఎందరో ఎన్నో సార్లు మైదానం లోపలా బయటా గొంతు చించుకున్నా, ప్రతీసారి తన ఆట తోనే సమాధానం చెప్పాడు…. ఎప్పుడు తన నోరు మాత్రం జార లేదు…. బ్రెట్ లీ, మెగ్ గ్రాత్ లాంటి వాళ్ళు ఎన్నో సార్లు రెచ్చగొట్టినా, వకార్ లాంటి బౌలర్స్ రక్తం వచ్చేలా గాయం చేసినా…. ఎన్నో మేటి మేగజైన్స్ సచిన్ పని అయిపోయిందా అని ఎన్ని సార్లు పెద్ద ఆర్టికల్స్ రాసినా అన్నిటికి తన ఆటతోను, బాట్ తోనే సమాధానం చెప్పాడు గాని ఎన్నడూ తన వ్యక్తిత్వానికి మాత్రం మచ్చ తెచ్చుకోలేదు ఈ సచ్చీలుడు.....

2004 లో, ఔట్ లుక్ మేగజైన్ Sachin-End-ul-kar అనే వ్యాసం రాసి సచిన్ శకం ముగియబోతుందా అని రాసినా, 2006 లో టైమ్స్ అఫ్ ఇండియా ఇదే విధం గా End-ul-kar అని కాప్షన్ పెట్టినా, తన నిగ్రహణ మాత్రం కోల్పోకుండా, ఎప్పుడూ తన ప్రజ్ఞే చూపించాడు…. End-ul-kar పదం పుట్టిన ఆనాటి నుంచి ఇప్పటి వరకు, కొన్ని వేల పరుగులు చేసాడు, దాదాపు ముప్పై కి పైగా సెంచురీలు చేసాడు…. వాళ్ళ అమాయకత్వం కాకపోతే, ఏ బంతిని ఎలా కొట్టాలో తెలిసిన క్రీడాకారుడికి ఆటను ఎప్పుడు ముగించాలో ఒకరు చెప్పే అవసరం ఉంటుందా??

అయినా, సచిన్ ని పరుగులతో కొలవటం జనాలు ఎప్పుడో మరచిపోయారు, కాదు కాదు విడిచిపెట్టేసారు…. ప్రతీ మ్యాచ్ లోనూ తనదైన ముద్ర వేస్తూ, సగటు ప్రజల ఉద్వేగాల్లో ఉత్సాహం నింపుతూ అలసట ఎరుగని పయనం సాగించాడు…. కాని సచిన్ అభిమానించింది కేవలం అతని ఆటని చూసి మాత్రమే కాదు, ఎన్ని చేస్తున్నా తనని తాను మలచుకున్న తీరు, మచ్చ లేకుండా చెక్కుకున్న తన వ్యక్తిత్వం,  పెరగటమే గాని తగ్గని వినయం…. అందుకే యావత్ భారతదేశం తనతో, తన ఆటతో తాదాత్మ్యం చెందిది, తన కోసం ప్రార్థించింది…. దేవుడు అనేటంతటి స్థాయికి తీసుకెళ్ళింది….

ఎన్నో సార్లు కేవలం సచిన్ బాటింగ్ చూడటానికి తెల్లవారు ఝామున లేచిన మత్తు ఇంకా వదల్నే లేదు…. కొన్ని సంవత్సరాల క్రితం షార్జా లో వచ్చిన సచిన్ తుఫాను తడి ఇంకా మనసు నుంచి పోనేలేదు, కళ్ళు చేదిరే స్ట్రైట్ డ్రైవ్, కవర్ డ్రైవ్ లు ఇంకా కళ్ళను వీడనే లేదు కానీ ఇంతలోనే క్రికెట్ ప్రపంచం నుంచి సచిన్ విరమణ….    
ఒక సగటు అభిమాని కలలో కూడా ఊహించని ఆ క్షణం…. భారత్ గెలిచినా, అందరి కళ్ళు అతని వైపే ఆత్రుతగా చూసే ఆ క్షణం…. ఉబికివస్తున్న తన ఉద్వేగాన్ని అణుచుకుంటూ, తన్నుకొస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ తను అడుగులు వేస్తున్న ఆ క్షణం…. నాలాంటి కొన్ని కోట్ల అభిమానుల కన్నుల్లోనూ కన్నీటి సుడులు తిరిగుతూ ఉన్న ఆ క్షణం…. ఇక సెలవు అంటూ అభివాదం చేసిన ఆ క్షణం…. కాని అది ఆటగాడిగా మాత్రమే విరమణ, సచిన్ కి కాదు, అతని ప్రభావానికి అంతకంటే కాదు…. సచిన్ పంచిన జ్ఞాపకాలు, అనుభూతులు, ఆఖరికి తన చివరి స్పీచ్ ఎప్పటికీ పదిలం మా గుండెల్లోనే….


రిటైర్ అయినా…. అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఈ మాస్టర్ బ్లాస్టర్…. హృదయాల్లో ఎప్పటికీ నాటౌటే…. అందుకే ఇంతింతై సచినింతై పద్మవిభూషనుడై, భారతరత్నమయ్యాడు….




   

Thursday, August 1, 2013

తెలుగు తల్లికి చీలికలు

ఒకప్పుడు... దేశం లో నాలుగో అతిపెద్ద రాష్ట్రం, జనాభా లో ఐదవ పెద్ద రాష్ట్రం, భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం, దేశంలో ఐదవ పెద్ద నగరాన్ని కలిగిన రాష్ట్రం... కానీ ఇప్పుడు అదంతా చరిత్ర... ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ సాగదీస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజణ అంశం ఇక తేలిపోయింది... కాదు కాదు చీలిపోయింది... అవును అచ్చంగా ఆంధ్ర ప్రదేశ్ ని రెండుగా చీల్చేసారు.  ఎవరి స్వార్ధం కోసమో, ఎవరి ఉద్దేశాలను  ఉద్ధరిద్ధామనో గాని, మొత్తం మీద తెలుగు తల్లికి చీలికలు తెచ్చేసారు....

1953 లో అప్పటి దాక ఆశలు పెంచుకున్న మద్రాసు పట్టణాన్ని వదిలేస్తూ తన ఉనికిని స్థిరపరచుకోవటం కోసం సరికొత్త పయనం ప్రారంభించిన ఆంధ్ర రాష్ట్రం, 1956 లో హైదరాబాద్ స్టేట్ తో కలిసి హైదరాబాద్ ని రాజధానిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ గా అవతరించి సాగించిన పయనం,  మరో ఐదు దశాబ్ధాల తర్వాత, తొలుత ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడికే వచ్చింది...

కొత్త రాష్ట్రం అయితే ఇచ్చేసారు గాని, ఆ కొత్తగా వచ్చిన రాష్ట్రం ఏంటో అర్ధం కాలేదు.... 29వ రాష్ట్రం గా తెలంగాణా ఏర్పాటు చేసేస్తున్నాం అని ప్రకటన వచ్చేసింది గాని,  ఒకప్పటి ఆంధ్ర ప్రదేశ్ అనే రాష్ట్రం నుంచి తెలంగాణాని విడదీసారో లేకపోతే రాయల సీమని, కోస్తాంధ్ర ని విడదీసి వేరే రాష్ట్రం ఇచ్చారో అర్ధం కాలేదు... సాధారణంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తన రాజధానిని వెతుక్కుంటూ పయనం మొదలుపెడుతుంది, కాని ఇక్కడ జరిగింది పూర్తిగా వ్యతిరేకం...  ఎవరైతే ప్రత్యేక రాష్ట్రం కావాలని పట్టుబట్టారో వారిని విడదీసి అన్నీ పుష్కలంగా ఉన్న బంగారు పళ్ళాన్ని చేతికి యిచ్చేసి, మాకు ఈ విభజన  వొద్దు మొర్రో అని మొత్తుకున్న వాళ్లకి మాత్రం  మీ ఏడుపు మీరు ఏడవండి అని దిక్కులు చూపించి వదిలేసారు....

ఇక్కడ ఇంకో చమత్కారం.... విడిపోయిన రాష్ట్రానికి తీరు తెన్ను ఉండదు కాబట్టి కొన్ని వరాలు కురిపిస్తూ  ఉంటారు, కాని ఇదేంటో, విడిపోగా మిగిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే అనేక వరాల జల్లు కురిసింది (అని అనుకోవాలేమో)... హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని గా ఒక 10 సంవత్సరాలు వాడుకోవచ్చట..... పోలవరానికి జాతీయ హోదా కూడా కట్టబెడతారట... అన్నిటికన్నా మించి కలలో కూడా ఊహించని వరం, తెలంగాణాలో ఉన్న సీమాంధ్ర జనాలకి రక్షణ కూడా కలిపిస్తారట (అంటే తెలంగాణేతరులకి భద్రత ఉండదని ఒప్పుకున్నట్టేనా?).... ఇన్ని వరాలు ఏం చేసుకోవాలో తెలీక, ఆ వరాల వరదలో కొట్టుకుపోతున్నట్టుగా ఉన్నారు ఈ సీమాంధ్ర నేతలు, పాపం అందుకే ఎక్కడా కూడా కనిపించట్లేదు ఈ వరాల జల్లు గురించి గొప్పగా చెప్పి జనాల కళ్ళు తెరిపించటానికి....

తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణా నాది, రాయలసీమ నాది అన్న పాటకి ఇంక అర్ధం ఏముంది?? 57 ఏళ్ళ అనుబంధం తెంచేసుకుని విడిపోవటం అంత తేలికా?? ఇన్నేళ్ళు అహర్నిశలు కష్టపడి కట్టుకున్న కలల సౌధాన్ని వదిలేసి వెళ్ళిపోవటం అంత సులువైన పనా.... రాజధానిని ఏర్పాటు చేసుకోవడం అంటే అదేదో విటలాచార్య చిత్రాలలోలా రాత్రికి రాత్రి వచ్చేదేమి కాదు కదా! కలిసివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, కొత్త అవకాశాలని కల్పించుకుంటూ, చేసే కొన్ని దశాబ్ధాల కృషి... కాని దానిని సాధ్యమైనంత త్వరలో చేసేసుకుని రాజధానిని ఏర్పాటు చేసేసుకోవాలట... అది ఎలాగో చేసి చూపించే నాయకుడు, కనీసం ఆ గమ్మత్తేదో మీరే కాస్త చేసి చూపించండి అని కేంద్రాన్ని నిలదీసే సరైన నాయకుడే కరువయ్యాడు...

విడదీయటానికి కాంగ్రెస్, కాని లెక్కలు సరి చూడటానికి మాత్రం కమిటీ. అలానే వేసిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన తీర్మానానికి ఏమంత విలువ ఇచ్చిందని ఇప్పుడు మరలా వేరే కమిటీలు వేసి లెక్కలు తేల్చటానికి, ఎలాగు తెల్చిపారేసేది సదరు అధిష్టాన దేవతలే అయినపుడు??... దక్షిణ భారత దేశం లో ఇప్పటిదాకా పరిష్కారమే అవ్వని కావేరి జలాల పంపకం వదిలేసి ఇప్పుడు కొత్తగా విడివడిన ఈ రెండు రాష్ట్రాల జలాల విషయాలు తేల్చి పాడేస్తారట... ఇంతకన్నా విడ్డూరం ఏముంటుంది.....

అయినా మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవటం దేనికి అన్నట్టు, ముఖ్యమంత్రి, అధికార పార్టీ అధ్యక్షుడు, చరిష్మా కలిగిన నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రాంతం నుండే అయినా, జరిగే అన్యాయాన్ని విడ్డూరం చూస్తున్నట్టు చూస్తూ ఆపలేని నిస్సహాయులు వీరు... జరిగిపోయిన తర్వాత చేయగలిగినది ఏముంది, కనీసం మన సోదరులైనా ఆనందంగా ఉంటారు అని అనుకుందాం...

ఈ సరికొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఎప్పటిలాగే ఈ రాజకీయ నాయకులు చేసే నాటకాల ప్రహసనం లో పడి కొట్టుకుపోకుండా, తమ సహజమైన కష్టపడే గుణంతో సరికొత్త పయనం ఆరంభించి సొంతరాష్ట్రం లో పురోగమించి అభివృద్ధి సౌధాలు నిర్మించుకుంటే తెలుగు తల్లితో పాటు, తెలుగు జాతి కూడా గర్వపడుతుంది..

కాళోజీ గారు అన్నట్టు...
సాగిపోవుటయే బ్రతుకు.... ఆగిపోవుటయే చావు....
సాగిపోదలచిన.... ఆగరాదిచటెపుడు....
బ్రతకదలచిన పోరు.... సుతరామం తప్పదు....
చూపతలచిన జోరు.... రేపనుట ఒప్పదు....

Sunday, June 16, 2013

మా నాన్న

మనకోసం ఎన్నో కష్టాలు, బాధలను దిగమింగుతూ ...... కుటుంబ బరువు బాధ్యతలని భుజానికెత్తుకుని...... మన కోసం ఇష్టం గా కష్టపడుతూ ..... మనమే ప్రపంచం గా బ్రతికే
అమ్మా నాన్నలకి మనమేం ఇవ్వగలం .....

నాన్న అనే  పదం పలుకుతున్నప్పుడు  పెదవులు కలవవేమో గాని, ఇంట్లో అనుబంధాల్ని కలుపుతూ పునాదులు వేసేది మాత్రం నాన్నే..... ఇన్నేళ్ళ జీవితంలో కష్టాలన్నీ టీవీ సీరియల్స్ లో చూసినట్టు ఉన్నామే తప్ప ఏనాడు మా దరి చేరలేదంటే దానికి కారణం నాన్నే ....

సినీ కవి అన్నట్టు
"నాన్నా! నీ మనసే  వెన్నా
అమృతం కన్నా... అది ఎంతో మిన్నా!"
అనే పాటకు అచ్చమైన సాక్ష్యం గా నిలిచేది మానాన్నఅని అనడంలో అతిశయోక్తి లేదు....

రెండు మూడు కిలోమీటర్లు కూడా చాలా దూరం అనుకుని ఇంటి దగ్గరలోనే ఉన్న స్కూల్ లో వేసేదీ నాన్నే.... రెక్కలొచ్చాక దేశాలు దాటి వెళ్తున్నప్పుడుఎదిగే పక్షికి ఎగరటం అవసరం అని తన బాధని  చిరునవ్వు  తెర వెనుక దాచి వెన్నుతట్టి ప్రోత్సహించేదీ, అమ్మకి ధైర్యం చెప్పేదీ నాన్నే...

ఊహా తెలిసినప్పటినుంచి, నిద్ర పోయేప్పుడు కథలు చెప్పటం, నిద్రపోయేవరకు పాటలు పాడి జోకొట్టడం ఎప్పటికైనా మరచిపోగలమా? ఇన్ని చేస్తున్నా, ఎప్పుడూ తన బడలిక మా ముందు చూపించకపోవటం నాన్నకే సాధ్యమేమో. చిన్నతనంలో రామాయణ, మహాభారత కధలు చెప్పటం, మన సంస్కృతిని తన తరువాత తరం వారికి అందజెయ్యాలనే తపనే అప్పుడు నాటిన విత్తనం ఇప్పుడు రాముడి మీద గౌరవాన్ని, రామాయణం మీద నమ్మకాన్ని, కుటుంబం మీద అభిమానాన్ని ఏర్పరిచాయంటే అది నాన్న వల్లనే….

మాకు ఆలస్యం అయ్యిందని స్కూల్ కి గబగబా వెళ్ళిపోతే, తన ఆఫీసుకి ఆలస్యం అవుతున్నా పట్టించుకోకుండా స్కూల్ కి పాలు, టిఫిన్లు తీసుకురావటం ఇంకా గుర్తే.... పై చదువులు కోసం మేము వేరే రాష్ట్రం వెళ్తున్నప్పుడు, నాన్న నిద్రలేని రాత్రుల గురించి అమ్మ చెప్తూంటే, అలా ప్రేమ కురిపించటం సాధ్యమేనా అనిపించేది.

ఇన్నేళ్ళళ్ళో ఎప్పుడు ఫోన్ చేసినా, ఎలా వున్నారు? భోజనం చేసారా, జాగ్రత్తగా ఉంటున్నారా అని అడగటమే... ఐదంకెల జీతం వస్తున్నా కూడా, ఏరా? సరిపోతుందా, ఏమైనా ఇబ్బందిగా ఉందాఇంకా ఏమైనా కావలా, అని అడగటమే తప్ప, ఇంతవరకు మా దగ్గర నుండి ఏమీ  ఆశించలేదు…   అమ్మ కడుపు చూస్తుంది అన్నట్టు, మా నాన్న కూడా కడుపే చూస్తుంటే, మాకు ఇద్దరూ అమ్మలే అని చెప్పుకోవటం చాలా గర్వంగా ఉంటుంది.

కాలక్రమేణా తనని తను  మార్చుకుంటూ... ఎప్పటికప్పుడు  ప్రేమని పంచుతూ.... ఎండకి తను ఎండి, వానకి తను తడిచి మాకు గొడుగుగా కాపు కాస్తుంటే..... చిన్నప్పుడు మా మంచి నాన్న అని వెనకాలే తిరుగుతూ ఉండే మేమే, ఇప్పుడు నాన్నకి చాదస్తం పెరిగిపోయింది అని అంటున్నా, పాపం పిల్లలే, తెలిసీ తెలియకుండా ఎదో అంటారు, అని నవ్వుతూ వదిలేయటం నాన్నకి  మాత్రమే సాధ్యమేమోనిజమేనాన్న ఓ నిండు ప్రేమ కుండ, తొణకడు.