Friday, February 22, 2013

ఏ దేవుడు కాపాడుతాడో??




ఎప్పటి లాగే ఆఫీసు నుంచి వచ్చి టీవీ పెట్టగానే హైదరాబాద్ లో వరుస బాంబు పేలుళ్లు అంటూ బ్రేకింగ్ న్యూస్. అబ్బా మళ్ళీ బాంబు పేలుళ్ళా!!!  మొన్ననే కదా గతం లో జరిగిన కొన్ని బాంబు పేలుళ్ళ నిందితులను పట్టుకుని శిక్షించింది... అంటే పట్టుకోవటం మామూలే ముష్కరుల దాడులూ మాములే... ఎన్నాళ్ళని నరమేధం, ఎన్నేళ్ళని మారణహోమం.... వీటి అంతానికి   దేవుడు దిగి రావాలో? రాముడే కోదండం పట్టుకుని రావాలో, కృష్ణుడు సుదర్శనం తో దిగాలో... ఎవరో వచ్చి ఏదో చేసే వరకు ఆగదేమో  రావణ కాష్టం?

దాడులు జరగగానే, పేలుళ్ళను  తీవ్రంగా ఖండించిన ప్రధానమంత్రి, దోషులు ఎలాంటి వారైనా వదిలిపెట్టం అని హెచ్చరించిన ముఖ్య మంత్రి అన్నవార్తలు... ఖడిస్తున్నాంకఠినంగా  శిక్షిస్తాం అని అనటం తప్ప ఇంకేం చెయ్యగలరు? కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్న, జరిగిన, దాడుల సంగతి నిందితుల సంగతి ఏమయ్యిందో ఎవ్వరికీ తెలీదు... ఇలా ఎప్పటికప్పుడు దాడులు జరిగినప్పుడల్లా, పట్టేసుకుంటాం, పొడిచేస్తాం అని మాత్రం సదరు ప్రభుత్వం తరపునుంచి వింటూనే ఉంటాం.... కాని జరిగేది జరుగుతూనే ఉంటుంది, జరగనిది ఎప్పటికీ జరగదు.

కాని ఏమిటి నరమేధం?? ఎప్పుడో పురాతన దుర్మార్గపు రాచరిక వ్యవస్థలో లేము కదా..  ఇష్టం వచ్చినట్టు  అరాచకాన్ని సృస్టించటానికి... ఉన్నది 21 శతాబ్దం లో, ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో... కాని అరాచకం అణచివేయటానికి మాత్రం ఇంకా పట్టే చిక్కలేదు.... మారణహోమం లో బలయ్యేది ఎప్పుడూ సామాన్యుడే.... ఆటవిడుపు కోసం వచ్చిన సామాన్యులు, తమ ఇళ్ళకు చేరుకోటానికి బస్సు స్టాండ్ లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న సాధారణ ప్రజానీకం, విద్యార్ధులు,  పొట్టకూటి  కోసం వచ్చిన అమాయకులు... వీళ్ళేదో ప్రమాదం లోనో యుద్ధాల్లోనో, గొడవల్లోనో ప్రాణాలు కోల్పోవట్లేదు...

సాధారణ జీవితం కూడా గడపటానికి వీలులేని  వ్యవస్థలో ఉన్నామా... ఈ ఉగ్రవాదానికి, ఉన్మాదానికి అంతం అనేదే లేదా? పోనీ ఆపటానికి మనవంతు చేస్తున్నదేది? దాడులు జరగొచ్చని ముందే హెచ్చరించిన తర్వాత కూడా ఇంతటి నిర్లక్షం నిర్లిప్తత?.... దీనికి ఎవరు బాధ్యులుఎప్పటిలానే బాధ్యతా రహితం గా ఉన్న ప్రభుత్వమా? మనమేమి  చేయ్యలేములే అని వదిలేసే ప్రజానీకమా? మన దాక వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకునే మేధావి వర్గమా? ఎవరిని బాధ్యుల్ని చెయ్యగలం... ఎవరికి వారు వేలెత్తి చూపేవారే.. పోనీ మన దాయాదుల దేశాల లో జరుగుతున్న నరమేధం కన్నా ఇది పర్వాలేదులే అని సరిపెట్టేసుకుందామా? ఇవన్నీ బదులు లేని ప్రశ్నలే...

ఏదేమైనా అరాచకం లో ఎప్పుడూ బలైపోతున్నది మాత్రం ప్రజానీకమే.. అందుకే ఏదో ఒక దేవుడు ఏదో ఒక అవతారమెత్తి రావాల్సిందే...

రామ బాణం ఆర్పుతుందో రావణ కాష్టాన్ని??
కృష్ణ గీతి ఆపుతుందో మారణహోమాన్ని??



Thursday, February 21, 2013

సాధ్యమేనా???

పక్షి తన గుడ్డు ని పొదుగుతున్నప్పుడు, ఆ గుడ్డు ని తన ఉదర భాగం కింద ఉంచి
దాని మీద తన బరువు పడకుండా జాగ్రత్తగా కూర్చుని, తన కాళ్ళు నొప్పి పెడుతున్నా, ఆ గుడ్డికి వెచ్చదనాన్ని ఇస్తూ...
తన స్పర్స వల్ల ఊపిరి పోసుకుంటున్న పక్షి పిల్ల తో తనకు కలగబోతున్నఅనుబంధాన్ని
తలచుకోవటం చేత వచ్చిన మాతృత్వ భావన ఆనంద ధారగా హృదయము నందు కదులుతున్నప్పుడు నిశ్చలం గా కూర్చున్న ఆ పక్షి ని చూసి.....
పొదుగుతున్నపక్షినీ, పల్చటి గుడ్డు పైపొర చీల్చుకుంటూ బయటికి వస్తున్న పక్షి పిల్లని గీయగలమేమో గాని,
ఆ తల్లి పక్షి అనుభవిస్తున్నఅవ్యక్తమైన ఆనందాన్ని చిత్రీకరించటం ఏ కుంచెకైనా సాధ్యమేనా???