Thursday, August 1, 2013

తెలుగు తల్లికి చీలికలు

ఒకప్పుడు... దేశం లో నాలుగో అతిపెద్ద రాష్ట్రం, జనాభా లో ఐదవ పెద్ద రాష్ట్రం, భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం, దేశంలో ఐదవ పెద్ద నగరాన్ని కలిగిన రాష్ట్రం... కానీ ఇప్పుడు అదంతా చరిత్ర... ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ సాగదీస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజణ అంశం ఇక తేలిపోయింది... కాదు కాదు చీలిపోయింది... అవును అచ్చంగా ఆంధ్ర ప్రదేశ్ ని రెండుగా చీల్చేసారు.  ఎవరి స్వార్ధం కోసమో, ఎవరి ఉద్దేశాలను  ఉద్ధరిద్ధామనో గాని, మొత్తం మీద తెలుగు తల్లికి చీలికలు తెచ్చేసారు....

1953 లో అప్పటి దాక ఆశలు పెంచుకున్న మద్రాసు పట్టణాన్ని వదిలేస్తూ తన ఉనికిని స్థిరపరచుకోవటం కోసం సరికొత్త పయనం ప్రారంభించిన ఆంధ్ర రాష్ట్రం, 1956 లో హైదరాబాద్ స్టేట్ తో కలిసి హైదరాబాద్ ని రాజధానిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ గా అవతరించి సాగించిన పయనం,  మరో ఐదు దశాబ్ధాల తర్వాత, తొలుత ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడికే వచ్చింది...

కొత్త రాష్ట్రం అయితే ఇచ్చేసారు గాని, ఆ కొత్తగా వచ్చిన రాష్ట్రం ఏంటో అర్ధం కాలేదు.... 29వ రాష్ట్రం గా తెలంగాణా ఏర్పాటు చేసేస్తున్నాం అని ప్రకటన వచ్చేసింది గాని,  ఒకప్పటి ఆంధ్ర ప్రదేశ్ అనే రాష్ట్రం నుంచి తెలంగాణాని విడదీసారో లేకపోతే రాయల సీమని, కోస్తాంధ్ర ని విడదీసి వేరే రాష్ట్రం ఇచ్చారో అర్ధం కాలేదు... సాధారణంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తన రాజధానిని వెతుక్కుంటూ పయనం మొదలుపెడుతుంది, కాని ఇక్కడ జరిగింది పూర్తిగా వ్యతిరేకం...  ఎవరైతే ప్రత్యేక రాష్ట్రం కావాలని పట్టుబట్టారో వారిని విడదీసి అన్నీ పుష్కలంగా ఉన్న బంగారు పళ్ళాన్ని చేతికి యిచ్చేసి, మాకు ఈ విభజన  వొద్దు మొర్రో అని మొత్తుకున్న వాళ్లకి మాత్రం  మీ ఏడుపు మీరు ఏడవండి అని దిక్కులు చూపించి వదిలేసారు....

ఇక్కడ ఇంకో చమత్కారం.... విడిపోయిన రాష్ట్రానికి తీరు తెన్ను ఉండదు కాబట్టి కొన్ని వరాలు కురిపిస్తూ  ఉంటారు, కాని ఇదేంటో, విడిపోగా మిగిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే అనేక వరాల జల్లు కురిసింది (అని అనుకోవాలేమో)... హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని గా ఒక 10 సంవత్సరాలు వాడుకోవచ్చట..... పోలవరానికి జాతీయ హోదా కూడా కట్టబెడతారట... అన్నిటికన్నా మించి కలలో కూడా ఊహించని వరం, తెలంగాణాలో ఉన్న సీమాంధ్ర జనాలకి రక్షణ కూడా కలిపిస్తారట (అంటే తెలంగాణేతరులకి భద్రత ఉండదని ఒప్పుకున్నట్టేనా?).... ఇన్ని వరాలు ఏం చేసుకోవాలో తెలీక, ఆ వరాల వరదలో కొట్టుకుపోతున్నట్టుగా ఉన్నారు ఈ సీమాంధ్ర నేతలు, పాపం అందుకే ఎక్కడా కూడా కనిపించట్లేదు ఈ వరాల జల్లు గురించి గొప్పగా చెప్పి జనాల కళ్ళు తెరిపించటానికి....

తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణా నాది, రాయలసీమ నాది అన్న పాటకి ఇంక అర్ధం ఏముంది?? 57 ఏళ్ళ అనుబంధం తెంచేసుకుని విడిపోవటం అంత తేలికా?? ఇన్నేళ్ళు అహర్నిశలు కష్టపడి కట్టుకున్న కలల సౌధాన్ని వదిలేసి వెళ్ళిపోవటం అంత సులువైన పనా.... రాజధానిని ఏర్పాటు చేసుకోవడం అంటే అదేదో విటలాచార్య చిత్రాలలోలా రాత్రికి రాత్రి వచ్చేదేమి కాదు కదా! కలిసివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, కొత్త అవకాశాలని కల్పించుకుంటూ, చేసే కొన్ని దశాబ్ధాల కృషి... కాని దానిని సాధ్యమైనంత త్వరలో చేసేసుకుని రాజధానిని ఏర్పాటు చేసేసుకోవాలట... అది ఎలాగో చేసి చూపించే నాయకుడు, కనీసం ఆ గమ్మత్తేదో మీరే కాస్త చేసి చూపించండి అని కేంద్రాన్ని నిలదీసే సరైన నాయకుడే కరువయ్యాడు...

విడదీయటానికి కాంగ్రెస్, కాని లెక్కలు సరి చూడటానికి మాత్రం కమిటీ. అలానే వేసిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన తీర్మానానికి ఏమంత విలువ ఇచ్చిందని ఇప్పుడు మరలా వేరే కమిటీలు వేసి లెక్కలు తేల్చటానికి, ఎలాగు తెల్చిపారేసేది సదరు అధిష్టాన దేవతలే అయినపుడు??... దక్షిణ భారత దేశం లో ఇప్పటిదాకా పరిష్కారమే అవ్వని కావేరి జలాల పంపకం వదిలేసి ఇప్పుడు కొత్తగా విడివడిన ఈ రెండు రాష్ట్రాల జలాల విషయాలు తేల్చి పాడేస్తారట... ఇంతకన్నా విడ్డూరం ఏముంటుంది.....

అయినా మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవటం దేనికి అన్నట్టు, ముఖ్యమంత్రి, అధికార పార్టీ అధ్యక్షుడు, చరిష్మా కలిగిన నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రాంతం నుండే అయినా, జరిగే అన్యాయాన్ని విడ్డూరం చూస్తున్నట్టు చూస్తూ ఆపలేని నిస్సహాయులు వీరు... జరిగిపోయిన తర్వాత చేయగలిగినది ఏముంది, కనీసం మన సోదరులైనా ఆనందంగా ఉంటారు అని అనుకుందాం...

ఈ సరికొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఎప్పటిలాగే ఈ రాజకీయ నాయకులు చేసే నాటకాల ప్రహసనం లో పడి కొట్టుకుపోకుండా, తమ సహజమైన కష్టపడే గుణంతో సరికొత్త పయనం ఆరంభించి సొంతరాష్ట్రం లో పురోగమించి అభివృద్ధి సౌధాలు నిర్మించుకుంటే తెలుగు తల్లితో పాటు, తెలుగు జాతి కూడా గర్వపడుతుంది..

కాళోజీ గారు అన్నట్టు...
సాగిపోవుటయే బ్రతుకు.... ఆగిపోవుటయే చావు....
సాగిపోదలచిన.... ఆగరాదిచటెపుడు....
బ్రతకదలచిన పోరు.... సుతరామం తప్పదు....
చూపతలచిన జోరు.... రేపనుట ఒప్పదు....