Monday, October 29, 2012

రైలు ఎక్కించా కాని...


తనని రైలు ఎక్కించి వస్తున్నానా...
నడుపుతున్న బండి తేలికగా అనిపించింది... అలావాటైన బరువు లేక....
ఏదో తెలియని ఒక వెలితి... గతుకులోస్తే నా భుజం నొక్కే  చేయి లేక....
మనసంతా భారం... దారిపొడవునా వినిపించే మాటలు లేక....

తెలిసిన దారే అయిన తప్పిపోతానేమో అని కంగారు... 
చల్లగాలి తడుతున్నా రాలేకపోతున్న హుషారు...
ఇల్లు ఇంత దూరమా అనిపించేలా ఎంతకీ తరగని దూరం...
ఎప్పటిలాగే ఇంటికి చేరుకున్నా గాని చెప్పలేనంత భారం...
నా కోసం ఎదురుచూస్తున్న చీకటింటికి వచ్చా కాని లోపలికి వెళ్ళాలంటే ఏదో దిగులు...
లోపలికి వెళ్ళినప్పటి నుంచి మొదలు పెట్టాయి మళ్ళా తన రాక కోసం ఎదురు చూపులు....


Saturday, October 27, 2012

కొన్ని కలలు


కొన్ని కలలు కావ్యాలుగా మారి 
                 హృదయం లో పదిలం గా ఉండిపోతాయి....
కొన్ని కలలు కల్లలుగా మారి 
                 కంటి నీరు గా జారిపోతాయి....
కొన్ని కలలు కధలుగా మారి 
                 కంటి రెప్పల మాటున మిగిలిపోతాయి....
కొన్ని కలలు కలతలుగా మారి 
                 గాయాల్ని గేయాలు గా చేస్తాయి....
కొన్ని కలలు వాస్తవాలుగా మారి 
                 జీవితానికి పునాదులు వేస్తాయి....
కొన్ని కలలు కవ్వింపుగా మారి
                 రేపటి మీద ఆశలు రేపుతాయి....
కొన్ని కలలు  జ్ఞాపకాలుగా మారి
                 జీవితాన్ని ఆస్వాదింపజేస్తాయి ....

Wednesday, October 24, 2012

దసరా వచ్చింది మరి సరదా?


ఎప్పటిలాగే సారి కూడా దసరా రానే వచ్చింది.... కాని ఎందుకో సారి సరదా మాత్రం తీసుకురాలేదు... పెద్దవాళ్ళం (?) అవుతున్నానో లేక చిన్నతం నుంచి దూరం పెరిగిందనో లేక గతాన్ని పదిలంగా దాచిన ఇంటికి దూరంగా ఉన్నాననో కారణం ఏదైతే ఏమి సరదాలు తెచ్చే దసరా మాత్రం సారి ఎందుకో సాదా సీదాగా గడిచిపోయింది...

చిన్నప్పుడు దసరా సెలవుల కోసం ఎంతగా ఎదురుచూసేవాల్లమో, ఊర్లు వెళ్ళాలో ఏం చెయ్యాలి అని తెగ  ఆలోచించేసేవాళ్ళమో.... కాని ఇప్పుడు కనీసం ఒక్క సెలవు వచ్చినా చాలు అని అనుకుంటున్నా. సారి మాత్రం ఒక వారం రోజుల పాటు సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అని ఎప్పటినుంచో ప్లాన్ చేసేసాం, కాని అనుకోని కారణాల వల్ల వెళ్ళలేకపోయా.... ఎప్పుడో మూడు నెలల ముందే రిజర్వు చేయించుకున్న ట్రైన్ టికెట్లు బయలుదేరే రోజు వెళ్ళటం కుదరక కాన్సిల్ చేసేస్తుంటే మనసు జువ్వని పీకేసింది....

పాలవాడు, పోస్ట్ మాన్ ఇలా ఒకరేమిటి అందరూ దసరాకి దసరా మామూళ్ళు అడగటం, ఏదో ఒకటి చెప్పినా సరే మొత్తం మీద అమ్మా నాన్న మామూళ్ళ  వలలో చిక్కుకునేవాళ్ళు... కాని ఈసారి దసరా మామూళ్ళు అంటూ ఇక్కడ నన్ను ఒక్కరూ  అడిగిన పుణ్యాన పోలేదు... చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ లో చదువుకుంటున్న రోజుల్లో "అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్ల వాళ్లకు చాలు పప్పు బెల్లాలు" అనే పాట రాసుకుంటుంటే , పాట గురించి అమ్మ చెప్తూ ఇంకొన్ని పాటలు పాడుకుంటూ వాళ్ళ ఊరిలో అందరి ఇంటికి తిరుగుతూ వెళ్ళేవారమని అమ్మ చెప్పటం ఇంకా ఇప్పటికీ గుర్తే... అమ్మ చేసే రకరకాల పిండివంటల తో టీవీలో వచ్చే వెరైటీ ప్రోగ్రామ్స్ కోసం  ఆతురుతగా ఎదురుచూడటం కూడా గుర్తుంది...  దసరా ముందు రోజు (ఆయుధపూజ) నాన్న, అన్నయ్య, నేను స్కూటరు సైకిళ్ళు కడిగేసుకుని బొట్లు పెట్టేసి వెలిగించిన అగరబత్తుల సువాసన ఇంకా మరచిపోలేదు.... కాని ఇప్పుడు అంతకన్నా ఖరీదైన బండే ఉన్నా, చేసుకునే తీరిక (?) చెయ్యాలనే సరదా లేదు... 

నిస్సత్తువ పరిగెడుతున్న కాలాన్ని వెంబడించటం వల్ల వచ్చిన ఆయాసం వల్లనో... సరదాలు సరాగాలుగా ఉన్న సొంత ఊరికి దూరంగా ఉండటం వల్లనో తెలీదు గాని ఈసారి దసరా సరదాలు మాత్రం పరదాలు వేసి కొంచెం దూరం జరిగాయి...  వచ్చే దసరాకి అయినా "దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా" అని పాడుకుంటూ ఉండాలని ఆశిస్తూ...


Sunday, October 21, 2012

జీవితమే వైకుంఠపాళి


క్రితం వారం ఈనాడు వారి తెలుగు-వెలుగు మొదటి సంచిక చూస్తుంటే వైకుంఠపాళి చూసి చిన్నతనం ఓసారి గుర్తొచ్చింది. ఇప్పటి బాల్యానికి  వైకుంఠపాళి గురించి తెలీదేమో గాని ముందు తరాలలో వైకుంఠపాళి తో ఆడుకోని చిన్నతనం ఉండదేమో తెలుగు వారికి. జీవితాన్ని ఆస్వాదించ గలిగే ఆలోచనల్ని, ఎదిరించగలిగే దైర్యాన్ని, తట్టుకోగలిగే స్తైర్యాన్ని ఇచ్చే ఆట తెలుగు వారి సృష్టి అంటే అతిశయోక్తి కాదేమో.

ఎవరో అన్నట్టు, జీవితం వైకుంఠపాళీ లా ఉంటుంది. అప్పుడు అర్ధం అయ్యేది కాదు గాని, సరిగ్గా చూస్తుంటే అది నిజమే అని అనిపిస్తుంది ఇప్పుడు.... వైకుంఠపాళీలో ఎప్పుడు నిచ్చెనలు ఎక్కుతూ పరిగెడతామో.... పాము నోట్లో పడి కిందకి ఎప్పుడు జారతామో తెలుసుకోలేనట్టే... జీవితం లో కూడా ఒడిదుడుకులు, జయాపజయాలు ముందుగా తెలుసుకోలేం...  పాము నోట్లోపడితే చేయ్యగలిందేమి లేదు మళ్ళా నిచ్చెన కోసం ఎదురు చూస్తూ ఆడటం తప్ప... జీవితం లో కూడా అంతే, పొరబడినా, పడినా  జాలిపడి ఆగిపోదు కాలం. లేచి నిలబడి మళ్ళా కాలం తో పాటు వెళ్ళటమే...

చిన్నప్పుడు బాగా ఆడిన ఆటల్లో ఇదీ ఒకటి. ఖాళీ గా ఉంటే వైకుంఠపాళి.. ఖాళీ చేసుకుని వైకుంఠపాళి.. ఇలా తెగ ఆడేసిన చిన్నతనం... వేరేవాళ్ళతో ఆడినప్పుడు నాకే నిచ్చెనలు వచ్చెయ్యాలని,  పక్కవాళ్ళు పాము నోట్లో పడిపోవాలని అనిపించేది, అలా జరగకపోతే కుళ్ళు వచ్చేసేది.... ఒక్కోసారి కొన్ని క్షణాలలో ఆట తారుమారయ్యేది, అప్పటి దాక ఎంతో ఎత్తులో ఉన్నాకూడా క్షణాల్లో పాతాళంలోకి వచ్చేసేది... మెల్లగా అర్ధం అయ్యేది గెలుపు ఓటములు మన చేతుల్లో ఉండవు అని... కేవలం ఆడటం వరకే మన పని అని...

ఆట గురించి చెప్పాలంటే, మొత్తం ఉండేవి 11 వరుసలు, ఒక్కో వరసలో 11 గడులు ఉంటాయి.  మధ్య మధ్య గడులలో పాములు నిచ్చెనలు. అన్ని గడులు పూర్తయ్యాక పరపదసోపానపటం... దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు.. ఇదే చివరకు చేరుకోవాల్సిన స్థానం... అక్కడికి చేరుకునే వరకు జీవితం అనే ఆట ఆడుతూనే ఉండాలి అని చెప్పకనే చెబుతుంది..... లోగా మొదటి గడి నుంచి చివరి గడి వరకు ఎక్కుతూ దిగుతూనే  ఉండాలి... పడినా లేస్తూనే ఉండాలి... పరపదాన్ని చేరుకునే వరకు పడుతూ లేస్తూ పడినా లేస్తూ పరిగెడుతూనే ఉండాలి అని చెప్తుంది….

సరిగ్గా పరికిస్తే, ఇందులో చాలా గళ్ళలో ఎదో ఒక బొమ్మ, దానికో పేరు ఉంటాయి... కర్కోటకుడు దుర్యోధనుడు, అహంకారం లాంటి పేర్లు పాములు గా ఉంటాయి.  జీవితం లో కూడా ఇలా కర్కోటకం గా, అహంకారం గా ప్రవర్తిస్తే ఆటలోలా ఎంత ఎత్తుకు ఎదిగినా కిందకి పడిపోవటం తప్పదని సందేశం అనుకుంటా...  పాముల తోక లో పందో రాక్షసుడో  ఉంటారు...  జీవితం లో అలానే ఉంటే వీటిలానే హీనం అని హెచ్చరిక అనుకుంటా... పాముల అమరికతో పాటు నిచ్చెనల ఏర్పాటు కూడా భలే గొప్పగా ఉంటుంది.... వాటికి భక్తి,  చిత్తశుద్ది లాంటి పేర్లు... వీటిని ఎక్కితే చేరుకునే గడుల పేర్లు బ్రహ్మలోకం, కైలాసం... ఆథ్యాత్మిక సందేశాన్ని ఇంత తేలికగా చెప్పగలిగే  ఆట మన తెలుగు జాతికి గొప్ప వరం... 


వైకుంఠపాళి చూసి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా...గెలుపు ఓటములను ఒకేలాగా తీసుకునే స్థితప్రజ్ఞత ఇంకా రాలేదు. కనీసం ఓటమికి క్రుంగిపోకుండా ఉండే స్థైర్యం రావటానికి కూడా సమయం పడుతుందేమో.  కాని ఆటలో  పాములు, నిచ్చెనలు యెంత సహజమో జీవితంలో కూడా అపజయాలు, విజయాలు అంతే సహజమని మాత్రం తెలిసింది.... పాము నోట్లో పడి కిందకి పడిపోయినపుడల్లా అక్కడే ఆగిపోకుండా నిచ్చెన కోసం ఎదురుచూస్తూ అడుగులు వెయ్యటం నేర్పింది జీవితం... అందుకే ఒక సినీ కవి అన్నట్టు అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని... జరిగేవన్నీ మంచికే...  అవును నిజమే గెలుపు ఓటములు అనేవి మానసికానుభూతులు... మార్గం ఏదైనా అంతిమంగా ఎప్పటికైనా చేరుకోవాల్సింది మాత్రం పరమపదమే అనేదే సారాంశం.....

కొన్ని వేల పద్యాలు, పాటలు, మాటలు అందించగలిగే వికాసం ఒక్క తెలుగు ఆట అందించేస్తుంది.... జీవన సారాన్ని స్తైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నైతిక విలువల్నీరంగరించి అందించే అపూర్వ వ్యక్తిత్వ వికాస గ్రంధం మన  వైకుంఠపాళి... 


 సినీ కవి చెప్పినట్టు,
జీవితమే ఒక వైకుంఠపాళినిజం తెలుసుకో భాయి...
ఎగరేసే నిచ్చేనలే కాదు పడదోసే పాములూ ఉంటాయి...
చిరునవ్వుతో విష వలయాలను ఛేదించి  ముందుకు పోవోయి...