Wednesday, December 5, 2012

అక్షరధామం - అక్షరాలా అద్భుతం


ఇంచుమించు ఆరేడేళ్ళ క్రితం చదువుకుంటున్న రోజుల్లో మొదటిసారి గా అక్షరధాం చూసినప్పటి అనుభూతి ఇంకా పదిలం గానే ఉంది... ఈసారి ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాలి అనగానే అయిష్టం గానే ఒప్పుకున్నా కాని  రమ్య ని కూడా తీసుకువెళ్లి ఓసారి అక్షరధాంని చూపించాలి అని అనుకున్నా.... ఢిల్లీ చేరుకున్నప్పటి నుంచి అక్షరధాం గురించి రోజూ రకరకాలుగా ఏదో ఒకటి చెపుతూనే ఉన్నా... వీకెండ్ రాగానే వణికించే చలిని కూడా లెక్కచేయకుండా పొద్దుటే (?) 8 కల్లా లేచేసి రెడీ అయిపోవటం మొదలు పెట్టాం...  ఇంచుమించు 11 అవుతున్నా చలి ఇంకా ఒక ఊపు ఊపుతూనే ఉంది... మొత్తం మీద మెట్రో ఎక్కి అక్షరధాం స్టేషన్ లో దిగి మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్లాం... గతం లో జరిగిన తీవ్రవాదుల దాడి వల్ల సెక్యూరిటీ బాగా పెంచేశారు... మొత్తం మీద రక్షణ వలయాలు అన్ని దాటుకుంటూ తెచ్చుకున్నవన్నీ క్లోక్ రూమ్ లో పెట్టేసి  చేతులూపుకుంటూ లోపలి వెళ్ళిపోయాం....

సువిశాలంగా దాదాపు ఒక వంద ఎకరాలలో నిర్మితమైన అక్షరధాం లోపలికి ప్రవేశించగానే స్వాగతం పలికింది దశద్వార్... ఇవి పది దిక్కులకు ప్రతీకలట... నడుస్తున్న దారిలో ఇరువైపులా చెరో ఐదు ద్వారాలు వీణ తీగల్లా నీటిని పైనుంచి వదులుతూ ముందు ముందు ఇంకా ఎన్నో చిత్రాతి చిత్రమైన అనుభూతులకు లోనుకావల్సుంటుంది అని చెప్పకనే చెపుతాయి...  అది దాటగానే భక్తిద్వార్... అత్యంత సుందరంగా చెక్కబడిన శివ-పార్వతులు, లక్ష్మి-విష్ణువులు, బ్రహ్మ-సరస్వతులు, సీతా-రాములు లాంటి మొత్తం 208 జంట విగ్రహాలు ఉన్న పెద్ద ద్వారం ఎంతో అలరిస్తుంది... చిన్న విగ్రహాలే అయినప్పటికీ జీవకళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది... కళ్ళు చెదిరిపోయే విగ్రహాలు చూసుకుంటూ వెళ్ళగానే మయూర ద్వారం సిద్ధంగా  ఉంది లోపలకి పిలవటానికి... మొత్తం 869 నెమళ్ళు ఆనంద నృత్యం చేస్తున్నట్టు అందం గా స్థంబాలపై నిలుచున్నాయి.... 

ద్వారాలు దాటుకుని వెళ్ళగానే సువిశాలమైన ప్రాగణం మధ్య భాగం లో అత్యంత అద్భుతమైన ఆలయం అక్షరధాం....   తెల్లని, గులాబి పాలరాళ్ళతో నిర్మించిన 141 అడుగులు ఎత్తైన ఆలయం మనల్ని దిగ్బ్రాంతికి గురిచేస్తుంది... ఆలయం మొత్తాన్ని మోస్తూఉన్నట్లు నిర్మితమైన గజేంద్రపీటం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది... మహాలయంలో ఎన్నో కళాత్మక స్థంబాలు, కొన్ని గోపురాలు, కొన్ని వేల అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి...  ఆలయం చుట్టూ భారతీయ మహా పురుషులు, ఋషులు, దేవతా మూర్తుల సుందర శిల్పాలు ఎంతో అందంగా మలచబడి ఉన్నాయి... ఇలా చుట్టూ చూసుకుంటూ ఆలయం లోపలి ప్రవేశించగానే మధ్య భాగం లో బంగారు తాపడం చేయబడిన 11 అడుగుల స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం ఎంతో నయనమనోహరంగా ఉంది... ఆలయం వెలుపల చెక్కిన శిల్పాలు ఒక ఎత్తైతేఆలయం లోపలి శిల్ప కళా సౌందర్యం వర్ణనాతీతం... వాటి గురించి చెప్పాలంటే సాహసమే... కళ్ళు చెదిరిపోయే శిల్ప కళా రూపాలు, 65 అడుగుల ఎత్తైన పాలరాతి మండపాలు ఇలా ఒకటేమిటి ప్రతీది విచిత్రమే అద్భుతమే... మునుపెన్నడూ చూడని మేలు కలయిక, మన ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభ... ఒక్క మాటలో చెప్పాలంటే అదొక అత్యంత అద్భుత శిల్ప కళా విన్యాసం.... 
అక్షరధాం
గజేంద్రపీటం
ఆలయ దర్శనం అయిపోగానే నేరుగా వెళ్లి ఎక్సిబిషన్ టికెట్స్ తీసుకున్నాం...  ఎక్సిబిషన్ అంటే మా కాకినాడలో పండక్కి పెట్టె ఎక్సిబిషన్ అనుకునేరు... అలాంటిది కాదు గాని దీనికొక ప్రత్యేకత ఉంది..  ఎక్సిబిషన్ టికెట్ మీద మూడు షోస్ చూపిస్తారు 1. సహజానంద దర్శన్, 2. నీలకంఠ్  దర్శన్,  చివరగా 3. సంస్కృతి విహార్... ఇవన్నీ ఒక దాని మించింది మరొకటి... 

సహజానంద దర్శన్ లో ముందుగా స్వామి నారాయణ్ గురించి, అక్షరధాం గురించి చిన్న మూవీ చూపించి,  సజీవ భ్రాంతి కలిగించేటువంటి మట్టి ప్రతిమలతో, రోబోటిక్స్ లాంటి అత్యాధునిక టెక్నికల్ మాధ్యమంతో ఎంతో చాకచక్యంగా వెలుగు శబ్దాల వినియోగంతో స్వామి నారాయణ్ జీవితాన్ని అక్కడి ప్రదర్శన ఆవిష్కృతం చేసింది... దాని తర్వాత నీలకంఠ్ దర్శన్ లో 45 నిముషాలు నిడివి గల చలన చిత్రం అత్యాధునికమైన ఐమాక్స్ థియేటర్ లో..  "మిస్టిక్ ఇండియాయాన్ ఇన్క్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఇన్స్పిరేషన్" ....  ఆయన బాల్యం నుంచి స్వామి నారాయణ్ గా ఎదిగిన తీరుకది చిత్రణ.... ఒక సామాన్య బాలుడు జీవిత సత్యాన్వేషణలో ఎదిగిన క్రమం, ఎదురుకొన్న ఒడిదుడుకులు చిత్రీకరించిన తీరు ఆకట్టుకోక మానదు....  ముఖ్యం గా హిమాలయాల్లో పాదచారి అయి వెళ్తున్నప్పుడు వచ్చే నేపధ్య సంగీతం మనల్ని కూడా వెంటాడక మానదు...  

ఇంక చివరగా సంస్కృతి విహార్.. నాకు బాగా నచ్చిన షో ఇది... అన్నీ ఒక ఎత్తైతే ఇది ఒకటీ మరో ఎత్తు... భారతీయ సంస్కృతిని, చరిత్ర ని, గొప్పతనాన్ని, మేధస్సుని, నాగరికత ని ఒక పదేహేను నిముషాల్లో ఆవిష్కృతం చేసింది.... భూగర్భం లో కృత్రిమం గా ఏర్పాటు చేసిన నది లో ఒక పడవ ప్రయాణం తో వీటిల్ని పరిచయం చేసింది... పడవలో షికారు లా వెళ్తూ ఇరివైపులా ఒడ్డున అందమైన మట్టి బొమ్మలతో మన దేశ సంస్కృతిని వివరిస్తూ సాగింది... మన ఋషులు, శాస్త్రజ్ఞులు, పరిశోధనలు, అజంత ఎల్లోరా తక్షశిల ఇలాంటి నమూనాలు ఇలా ఒకటేమిటి ఎన్నో..   శ్రవ్య - దృశ్య ప్రదర్శన మమ్మల్ని ఎన్నో ఊహలలోకి తీసుకెళ్ళింది.... అంతలోనే అయిపోయింది... మన చరిత్ర అంత సులువుగా ఆకట్టుకునే విధంగా చెప్పటం అనుభవించటం నిజం గా ఒక వింత అనుభూతి... 
సంస్కృతి విహార్
ఇవన్నీ పూర్తవగానే మెల్లిగా సూర్యుడు పడమటింట చేరుకున్నాడు... సాయం సంధ్యవేళ అవ్వగానే దీపాల వెలుగు లో తెలుపు గులాబి బంగారు రంగుల కాంతి లో అక్షరధాం మహాద్భుతం గా ఉంది... మొత్తం దీపాలన్నీ వెలిగించగానే యజ్ఞపురుష కుండ్ అనే మ్యూజికల్ ఫౌంటెన్ మొదలయ్యింది.... కేవలం భారతీయ సంప్రదాయ సంగీతం తో నాట్యమాడే ఫౌంటెన్ ని ఒక్కసారైనా చూడాలి... దీనికి కూడా ప్రత్యేకం గా టికెట్ ఉంది... బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల  రూపాలను (నాకు అలానే అనిపించింది మరిసంగీతం తో ఫౌంటెన్ సొగసులతో చాకచక్యం గా చెప్పట్టం భలే ఆకట్టుకుంది... బ్రహ్మ స్వరూపం మెల్లిగా మొదలయ్యి విష్ణవు  విశ్వరూపాన్ని చూపించి చివరగా శివ తాండవాన్ని అత్యద్భుతంగా చూపిస్తే కళ్ళు ఆర్పకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నా.... అదొక అనిర్వచనీయమైన అనుభూతి....
బంగారు వర్ణం లో అక్షరధాం 
యజ్ఞపురుష కుండ్ - మ్యూజికల్ ఫౌంటెన్

ఇలా అన్ని పూర్తి అయ్యాక బయటికి వచ్చాం ఒక గొప్ప అనుభవాన్ని తోడు తెచ్చుకుంటూ... అక్షరధామం లో అడుగడుగునా వింత అనుభూతులే...  
అక్షరధామ మందిరం భారతీయ సంస్కృతీ,  సంప్ర దాయాలకు  చిహ్నంగానే  కాకుండా అపూర్వ  సౌంద ర్యానికీ, అపార విజ్ఞానానికిఆహ్లాదానికిప్రాచీన భవన నిర్మాణ శిల్ప సంప్రదాయానికి,  ఆధునిక  సాంకేతిక  పరిజ్ఞానానికి  ప్రతీకగా నిలుస్తుంది అనటం లో మాత్రం అతిశయోక్తి లేదు....



P. S : ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆలయం సముదాయం లో ఎక్కడా స్టీల్ వాడకం లేకుండా నిర్మాణం జరిగిందట...





2 comments:

  1. తప్పక చూడాలి అనేలా ఉందండి మీ పిక్స్ & పోస్ట్.





    ReplyDelete
    Replies
    1. Thank you Padmarpita gaaru.. వీలుంటే తప్పకుండా చుసేయ్యండి....

      Delete