Sunday, June 2, 2013

మా ఇళయరాజా

మెలోడి 'గతి' తప్పిన తెలుగు సినీ 'శ్రుతి' కి మతులు పోగొట్టే 'కృతులు' చేసి 'లయ'లకే హోయలద్దిన 'స్వర' రాజు మా 'ఇళయరాజా'.....
తెల తెలవారుతుండగా పూచే సుమాలే ఆయన స్వరాలు....అందుకే స్వరాలకి పదాలు ఫలాలుగా పండుతాయ్ మరి....
రాగాలు తన పాటే అనుకుని కోకిల హాయిగా పాడుకుంటూ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో...
నదులలో వీచే తిమ్మేరే ఆయన వీణా నాదం అంటే కొంచెం తక్కువేనేమో....
అలల ఫై నాట్యమాడే వెన్నెలే ఆయన స్వరపరిచిన వేణుగానం అంటే సరిపోవచ్చేమో.....
అందుకే ఎన్నో ఏళ్ళ క్రితం ఎప్పుడో చిన్న హార్మోనియం పెట్టె మీద కట్టిన రాగం కూడా ఇప్పుడే పూచిన 'పువ్వు'లా...అప్పుడే చిలికిన 'వెన్న' లా...వసంతం లో కురుస్తున్న 'వెన్నెల' లా... స్వచ్చం గా అనిపిస్తుంది....

చంద్రునికి తన వయోలిన్ విన్యాసాలతో వెన్నెల అద్దిన "సుందరమో సుమధురమో" గురించే చెప్పాలా..?
గోదావరికే వయ్యారాలు నేర్పిన... "వయ్యారి గోదారమ్మా" పాట గురించే చెప్పాలా...?  
వసంతాన్ని మన ముంగిట్లోకే తెప్పించిన... "తరలిరాద తనే వసంతం" గురించా..?
ఆమని సంగీతం అంటే ఇలానే ఉంటుందా అని అనిపించే... "ఆమని పాడవే హాయిగాగురించా..?
రాగాలతో ఉయ్యాలలూపే..... "కళ్యాణ రాముని కి కౌసల్య లాలి"… 
పువ్వు విరిసినప్పుడు ఉండే లాలిత్యానికి మాత్రం తగ్గని... "లలిత ప్రియ కమలం విరిసినది"....
మండుటెండలో కూడా మంచు కురిపించే.... "మంచుకురిసే వేళ లో".... 
విరహానికే విరహం వచ్చిందా అన్నట్టు... "జాబిల్లి కోసం ఆకాశమల్లె".....
మౌనం పాట పాడితే ఎలా ఉంటుందో చెప్పిన... "మాట రాని మౌనమిది"....
నిరంతరం వీణ తో వెంటాడే.... "నిరంతము వసంతము లే"...
వేదం లో నాదం ఉందంటూ కదం తొక్కిన... "వేదం అణువణువున నాదం"....
ప్రేమ లాలిత్యాన్ని అంతే సుకుమారం గా చెప్పిన.. " పాపా లాలి"....

ఇలా ఎన్నో ఆయన నుంచి ఆశువుగా వచ్చిన  స్వరాలు....కాదు కాదు వరాలు....

ఇదంతా నాణానికి ఒక వైపే...రెండో వైపు నేపధ్య సంగీతం (BGM).....దీని గురించి చెప్పటానికి మాటలు సరిపోవు...ఆయన స్వరాలే మాటలు గా మారి రావాలి...
ప్రతి చిత్రం లో ప్రతి భావానికి సరిగ్గా అతుక్కుపోయే నేపధ్య సంగీతాన్ని ఇవ్వటం లో సంగీత జ్ఞాని ని మించిన వారు లేరేమో...శంకరా భరణం లో చెప్పినట్టు  "ఒక్కో అనుభూతికి ఒక్కో నాదం ఉంది శ్రుతి ఉంది.. స్వరముంది"....అందుకే   స్వరాలలో ఒక్కో స్వరానికి ఒక భావం ఉంటుంది.... 'సాగర సంగమం' లో కమల్, జయప్రదల ప్రేమ సన్నివేశాలలో.... 'స్వర్ణ కమలం' లో వెంకి, భానుప్రియ మధ్య, 'ఏప్రిల్-1 విడుదల' లో ఒకే ట్యూన్ ని మూడు వేరు వేరు సన్నివేశాలకి వేరు వేరు modulations లో... 'మహర్షి' లో విరహ సన్నివేశాలలో మొహావేసం….. స్వాతిముత్యం.....గీతాంజలి...... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో....ఇంకెన్నో....
ఈయన  నేపధ్య సంగీతం వింటే... నిజ జీవితం లో కూడా నేపధ్య సంగీతం ఉంటే ఎంత బావుండేదో అనిపించకమానదు...

ఎంతటి దు:ఖంలో ఉన్నా ఆయన స్వరాలు మనసును తాకితే ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవు......అందుకే ఈయన స్వరాలు ఉర్రూతలూగిస్తాయి... ఓలలాడిస్తాయి... సముద్రాల  లోతులు చూపిస్తాయి...రెక్కలు తొడిగి ఆకాశపు అంచుకు ఎగరేస్తాయి.....హృదయాంతరాళం లో తరంగాలు గా దూసుకేల్తాయి....

ఇలా చెప్పుకోవటానికి మరువలేని......మరపురాని......మధురమైన స్వరాలు ఎన్నో ఉన్నా... చెప్పటానికి నా దగ్గర అన్ని పదాలు లేవు....

పేరు లోనే లయ ఉన్న సంగీత స్వర మాంత్రికుడు.....మా 'లయ'రాజ స్వరాలు..... అనునిత్యం... నిత్యనూతనం......అనిర్వచనీయం.....అజరామరం......

సంగీత ధ్యానం చేస్తూ, సంగీతం కోసం తపిస్తూ తపస్సూ చేస్తూ, సంగీతాన్ని మధిస్తూ అమృతం రాబట్టే ప్రయత్నంలో అలసట ఎరుగడు ఈ పద్మభూషణుడు......తరతరాలకు నిరంతరం ఇలా స్వరాలని వరాలు గా ఇస్తూనే ఉండాలని కోరుకుంటూ.......

   
P.S: తన పాటల్లో అంతటి మాధుర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగిన ప్రశ్నకు ఇళయరాజా సమాధానం చెబుతూ "నేను సాధారణమైన మనిషిని. ఎప్పుడూ నా బాణీలకు ప్రేరణనిస్తున్న విషయం గురించి ఆలోచించలేదు. అది అలా వచ్చేస్తోందంతే! ప్రశాంతంగా కూర్చొని ఆత్మ మాట వింటుంటే సంగీతం దానంతట అది రావాల్సిందే! ఇన్నాళ్లూ ఆత్మతోనే సంగీతం అందించాను. సన్నివేశం, సందర్భం తెలుసుకొని అందులో ఉన్న అర్థం గ్రహించి స్వరాలు సమకూరుస్తాను. దాన్ని మెచ్చుకుంటున్న శ్రోతలకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి" అన్నారు. ఎంత ఎత్తుకి  ఎదిగామన్నదే కాదు ఎంత ఒదిగి ఉన్నామన్నదీ ముఖ్యమే అని ఆయన మాటలతోనే తెలిసిన ఈ మ్యూజిక్ మ్యాస్ట్రో గురించి ఇంకా ఏమని చెప్పాలి... 


  
మా రాజా గారి దర్శనం తర్వాత రాసుకున్న టపా ఈ కింద లింక్ లో.....


2 comments:

  1. Aayana gurinchi aayana paatala gurinchi maamulu maatalu saripovu, ilaa bhaavukathatho vraayaali. Chaalaa baavundi mi post.

    ReplyDelete
    Replies
    1. Thank you Sharma gaaru.... idhi bhaavukatha kaadhandi, idhi kooda aayana sangeetham ichina inspiration ee... aayana gurinchi cheppatam aayana sangeethaaniki maatrame saadhyamemonadi...

      By the way, welcome to my blog...

      Delete