Thursday, October 4, 2012

మహాత్ముడైనా క్షమించగలడా?


1948 జనవరి 30 జవహర్ లాల్ నేహ్రూ రేడియోలో అన్న మాటలు "మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించి, చీకటి అలుముకొన్నది. ఏమి చెప్పటానికీ నాకు మాటలు కరవయ్యాయి. మన జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించడు. మనను ఓదార్చి, దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకూ, కోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము"... కాని ఇప్పుడు జాతి వారసులు అపహాస్యంగా అంటున్న మాటలు "భారతదేశానికి స్వాతంత్ర్యం గాంధీ వల్ల వచ్చిందా? గాంధీ వల్ల ఆలస్యమైందామహాత్ముడి నిజస్వరూపం ఏమిటి? దేశానికి గాంధీ వరమా? శాపమా?"... ఆయన గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా బురద జల్లటానికి ప్రయత్నించేవారే...  ఏదేమైనా గాంధీ 'నాయకత్వం'లో భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చిందనేది చరిత్ర తెలిపిన సత్యం....

"ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు" అని ఐన్ స్టీన్ అన్నా, "జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు" అని మార్టిన్ లూధర్ కింగ్ అన్నా, "మహాత్మా గాంధీ ప్రపంచానికి హీరో" అని ఒబామా అన్నా,  మనకి మాత్రం ఆయన మీద ఎప్పుడూ తడుముకోకుండా తరుముకొచ్చే అనుమానాలే... ఆయన తెచ్చిపెట్టిన స్వతంత్ర ఫలాలు ఏంటంటే గాంధీ ని ఏమైనా అనచ్చు, గాడ్సేకి తాము వారసులుగా ప్రకటించుకోవచ్చు.... ఆయన పుట్టిన రోజున "డ్రై డే" అని తిట్టుకొనూవచ్చు...

"
అహింసకు మించిన ఆయుధం లేదు" అని అన్న ఆయన మాటకు చాలా విలువిచ్చి ఎంతో మారణహోమం సృష్టించిన వాళ్ళని కూడా క్షమాబిక్ష పెట్టటానికి చేయని ప్రయత్నం లేదు.... "ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు" అని అన్న మాటకి అంతే విలువిచ్చి ఆడది ఒంటరిగా ఎందుకు తిరగటం అని ఎంతో గట్టిగా ప్రశ్నిస్తున్నాం.... "సత్యాగ్రహానికి ఎంతో శక్తి ఉంది" అని చెప్పిన మాటని బాగా ఒంటబట్టించుకుని ప్రతి రాజకీయ అవసర అవలక్షణాలన్నీ సత్యాగ్రహం మాటతో కడిగేస్తున్నాం... "మద్యం మహమ్మారిని తరిమి కొట్టమనిచెప్తే ఊరికొక  వీధి పేరు గాంధీ అని పెట్టి  వీధిలోనే మద్యం షాపులు తెరిపించేసి ఆయన ఋణం బాగానే తీర్చుకుంటున్నాం.... ఇన్ని చేస్తున్నా మనకి ఆయన మీద అభిమానం మాత్రం ఇంకా  చావలేదు అందుకే ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం తో ఏదో విధంగా ఆయన మీద బురద జల్లుతూ వివాదాల సుడిగుండం లోకి లాగుతూనే ఉంటాం.....

గాంధీ జయంతి రోజునో, వర్ధంతి రోజునో తప్ప మిగిలిన రోజుల్లో మన రాజకీయ కీచకులకు గాంధేయ వాదం గుర్తుకు రాదు.... గాంధీ టోపీ తలపై ధరిస్తారుసత్యాగ్రాహాల పేరుతో ప్రభుత్వ ఆస్తులు తగలబెడతారు, ఇవన్నీ చేసాక కూడా మాదీ గాంధేయ వాదమే అంటారు...  ఇలాంటి సమాజాన్ని చూడటానికేనా అహర్నిశలు  కష్టపడింది, ఉప్పు సత్యాగ్రహాలు చేసింది, క్విట్ ఇండియా అంటూ ఉద్యమించింది... తెగించి తెచ్చుకున్న స్వతంత్రం కాస్తాస్వాహా’తంత్రం గా అయిపోతున్నా ఏమి పట్టనట్టు నిదురపోతున్న జాతిని చూసి మహాత్ముడు క్షమిస్తాడా? క్షమిస్తాడేమోలే ఎంతైనా మహాత్ముడు కదా....

గాంధీ మీద ఎన్నో అపవాదులు వేసి, వివాదాలు సృష్టిస్తూ పబ్లిసిటీ తెచ్చుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు చాలా మంచి... కాని ఇవన్నీ నిజమే అని తేలితే ఏమవుతుంది?? మహా అయితే ఆయనా మనలా మాములు మనిషే అని తెలుస్తుంది అంతే తప్ప అయన ఇమేజికి వచ్చే ముప్పేమీ లేదు.... 
He will always be remembered for what he contributed to humanity rather than what he is as an individual....


2 comments:

  1. Neelo intha aavesam vundani theleedu sumiii!!! Only your pen shows!!!

    ReplyDelete