Saturday, October 6, 2012

చేయూత



నేను ఎవరో తెలుసా? మీరు ఇది చూస్తున్నారు అంటే అది నావల్లే .... ఇంకా గుర్తుపట్టలేదా? అదేనండి మీకు అన్నీ చూపిస్తున్నది నేనే, కళ్ళు..... ఏంటి ఆశ్చర్యపోతున్నారా? చూపించే కళ్ళు మాట్లాడుతున్నాయి అనిఏంచెయ్యాలి మరి, కొందరికి కళ్ళు ఉన్నా చూడలేకపోతుంటే నాకు మాటలు రాకపోయినా మాట్లాడాల్సి వస్తుంది.... తప్పక మాట్లాడుతున్నానే తప్ప, ఎవ్వరిని నొప్పించటానికి మాత్రం కాదు సుమా....

ఫోటో చూసారా, తను కూడా మీ అందరి లానే ప్రకృతి ఒడి లోనే పుట్టింది... మీ అందరి లానే గాలినే పీల్చుకుంటుంది...  కాని మీ అందరిలా మాత్రం చూడలేదు తనకి నేను లేను.... అవును ఆమెకు  కళ్ళు లేవు…. తను అంధురాలు...  అలా అని తనేమి సమాజాన్ని తిట్టుకుంటూ కూర్చోలేదు...
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్నా సైన్యంముండునా అని అనుకుంటూ... తనకు చేతనైనది చేస్తూ  ఇదిగో బుట్టలు అల్లుకుంటూ చిరుగులుపడ్డ తన జీవన వాస్తవాలకి కుట్లు వెయ్యటానికి కృషి చేస్తోంది..... 

ఇలాంటి బుట్టలే మీరు పెద్ద మాల్స్ లో కొని ఇంట్లో పెట్టుకుంటారు కాని ఈవిడ దగ్గరే ఎందుకు కొనరో అర్ధం కాదు...  సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలలా మీరందరు?? కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే?? అని మీ మనస్సాక్షి మౌనం గా ప్రశ్నించక మానదు....
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కూర్చోకుండా తనకి చేతనైన పని చేస్తూ వెలుగు లేని తన జీవితంలో నిలబడేందుకు ప్రయత్నిస్తుంది....  మీరు తనకి దారి చూపక్కర్లేద్దు... దరి చేరి ఓదార్చక్కర్లేద్దు... ఆమె నడకకు  ఆసరా అయితే చాలు... పంచే గుణమే ‘money’షి  నిమనిషిగా చేస్తుంది...
ఎప్పుడైనా మార్తహళ్లి (బెంగుళూరు) నుంచి Old  Airport రోడ్ కి వెళ్తున్నప్పుడు Brandfactory దగ్గరలో చూడండి, మీరు నమ్మలేనంత వేగం తో ఆమె అల్లుతూ మీ కళ్ళకు పని  అప్పజెపుతుంది... చాలా మందిలా  చీకటిని చూస్తూ  తిట్టుకోకుండా  చిన్న  జ్యోతిని వెలిగించుకునే ప్రయత్నం చేస్తోన్న ఆమెకు..... అందరిలా చూసి వెళ్ళిపోకుండా చేయి చేయి కలిపి చేయూతనిస్తారని ఆశిస్తూ......


No comments:

Post a Comment